సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఒక స్టార్ హీరో మీద కొరడా ఝళిపించింది. స్టాక్ మార్కెట్లోకి రాకుండా ఆయనపై నిషేధం విధించింది. ఇంతకీ ఆ హీరో ఎవరు, సెబీ ఎందుకిలా చేసిందంటే..!
బాలీవుడ్ స్టార్ నటుడు అర్షద్ వార్సీ గురించి తెలిసిందే. ‘మున్నాభాయ్’ సిరీస్ సినిమాలతో ఆయన యాక్టర్‌గా మంచి క్రేజ్ సంపాదించాడు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ను తెలుగులో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేసిన విషయం విదితమే. హిందీలో ఎంత హిట్టయ్యిందో తెలుగులోనూ ఈ మూవీ అంతే పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ‘సలామ్ నమస్తే’, ‘గోల్మాల్ రిటర్న్స్’, ‘జాలీ ఎల్ఎల్బీ’ చిత్రాలతో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు అర్షద్. ఇటీవల ‘బచ్చన్ పాండే’లోనూ ఆయన మెరిశాడు. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ కలకలం రేపింది.
అర్షద్ వార్సీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బ్యాన్ విధించింది. యూట్యూబ్ ద్వారా పంప్ అండ్ డంప్‌కు పాల్పడుతున్న ఆరోపణలపై అర్షద్‌తో పాటు మరో 45 మంది వ్యక్తుల మీద సెబీ కొరడా ఝళిపించింది. స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించకుండా వారందరిపై ఒక ఏడాది పాటు నిషేధం విధించింది. అసలు పంప్ అండ్ డంప్ అంటే ఏంటంటే.. చౌకగా కొనుగోలు చేసిన స్టాక్‌ను ఎక్కువ ధరకు విక్రయించడానికి.. తప్పుడు ప్రకటనల ద్వారా స్టాక్ రేట్‌ను కృత్రిమంగా పెంచేందుకు ప్రయత్నించడాన్ని పంప్ అండ్ డంప్ అంటారు. యూట్యూబ్‌లో ఈ ప్రక్రియ ద్వారా అర్షద్ వార్సీ రూ.29.43 లక్షలు, ఆయన భార్య ర.37.56 లక్షలు అక్రమంగా లబ్ధిపొందారని తెలుస్తోంది. ఈ కేసులో వీరితో పాటు ఇతర నిందితులు అక్రమంగా సంపాదించిన సొమ్మును జప్తు చేయాలని సెబీ ఆదేశించింది.