సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ నుండి సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నివిధాలుగా ఫ్యాన్స్ లో అంచనాలు పెంచిన ఈ సినిమాను ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ తెరకెక్కించాడు. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
విడుదలకు ముందు ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేసి హైప్ క్రియేట్ చేసి.. వింటేజ్ మహేష్ బాబును గుర్తుచేశారు మేకర్స్. లవ్ – యాక్షన్ – కామెడీ – మాస్ – ఎమోషనల్ ఇలా అన్ని అంశాలను మేళవించిన ఈ సినిమా.. పక్కా కమర్షియల్ హిట్ గా థియేటర్లలో దూసుకుపోతుంది. అయితే.. ఈ సినిమాలో సముద్రఖని, నదియా, నాగబాబు, తనికెళ్ళ భరణి, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ ఇలా తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారంతా ఉన్నారు. కానీ సినిమాలో ఓ ఫ్రెష్ ఫేస్ మాత్రం సినిమా చూసిన వాళ్లందరినీ అట్రాక్ట్ చేస్తోంది.

ట్రైలర్ లో కీర్తిసురేష్ పక్కన ఓసారి, వెన్నెల కిషోర్ పక్కన మరోసారి కనిపించిన ఆ అమ్మాయి.. సినిమాలో కీర్తిసురేష్ ఫ్రెండ్ సౌమ్య క్యారెక్టర్ లో మెరిసి సర్ప్రైజ్ చేసింది. ఇంతకీ కొత్తగా కనిపిస్తున్న ఈ అందమైన ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. కేవలం ట్రైలర్ తోనే అందర్నీ అట్రాక్ట్ చేసిన ఆ అమ్మాయి పేరు సౌమ్య మీనన్. మలయాళంలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన హీరోయిన్. ఏంటి.. హీరోయినా? అని ఆశ్చర్యపోకండి.

మలయాళంలో కినవల్లి, ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్.. లాంటి సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా చేసింది సౌమ్య. ప్రస్తుతం సౌమ్య చేతిలో ఒక కన్నడ సినిమా, రెండు మలయాళ సినిమాలు, ఒక తెలుగు సినిమా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. తెలుగులో ట్యాక్సీ అనే సినిమా చేసింది. కానీ దానికంటే ముందే సర్కారు వారి పాట రిలీజ్ అయ్యేసరికి అందరి దృష్టిలో పడింది. అదీగాక.. సౌమ్య నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. కొన్ని మలయాళీ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ఆడిపాడింది. మరి సౌమ్య మీనన్ తెలుగులో హీరోయిన్ గా సెటిల్ అవుతుందా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
