'క్రాక్', 'వీరసింహారెడ్డి' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న నటి వరలక్ష్మిని ఓసారి జైల్లో పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఈమె తండ్రి శరత్ కుమార్ బయటపెట్టారు. ఇంతకీ ఆమెని లాకప్ లో ఎందుకు ఉంచారో తెలుసా?
నటి వరలక్ష్మి గురించి చెప్పగానే ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలే గుర్తొస్తాయి. పేరుకే తమిళ నటి అయినప్పటికీ తెలుగు సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే మూవీస్ లో ఎక్కువగా రెబల్ తరహా పాత్రలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది ఆమెని ఫైర్ బ్రాండ్ అనుకుంటూ ఉంటారు. అలా గతంలో వరలక్ష్మి ఓ విషయంలో జైలుకు కూడా వెళ్లిందని ఆమె తండ్రి, ప్రముఖ నటుడు శరత్ కుమార్ బయటపెట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నటుడు శరత్ కుమార్ బిడ్డగా వరలక్ష్మిగా అందరికీ పరిచయమే. 2012లోనే ‘పోడాపోడి’ అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా వరసగా చాలా సినిమాలు చేసింది గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ దక్కలేదు. దీంతో రూట్ మార్చింది. 2019లో వచ్చిన ‘పందెం కోడి 2’తో విలన్ గా మారింది. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసినప్పటికీ ఈమె యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. అలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘తెనాలి రామకృష్ణ LLB’,’క్రాక్’, ‘నాంది’, ‘యశోద’,’వీరసింహారెడ్డి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన ‘కొండ్రాల్ పావమ్’ రిలీజైంది.
ఈ మూవీ ఈవెంట్ లోనే మాట్లాడుతూ.. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఈమె గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. ఈమె ఎంత ధైర్యవంతురాలో కూడా చెప్పారు. ‘ఇప్పుడు అందరూ వరలక్ష్మిని విజయశాంతితో పోల్చుతున్నారు. అది నిజమే. ఈమె సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు.. ఇప్పుడు అవసరమా అని అడిగాను. కానీ ఆమె సినిమాలు చేయడానికే సిద్ధమైంది. ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఆమె శ్రమనే కారణం. అలానే వరలక్ష్మి చాలా ధైర్యవంతురాలు. ఓరోజు రాత్రి.. మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందని, ఇద్దరబ్బాయిల్ని కొట్టిందని ఫోన్ వచ్చింది. వారు అంతకు ముందు కారుకు డాష్ ఇవ్వడంతో వారిద్దరినీ చితకబాదింది.’ అని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. మరి కుర్రాళ్లని కొట్టి నటి వరలక్ష్మి ఓసారి జైల్లో ఉండటంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.