బుల్లితెర మీద అత్యధిక రేటింగ్, రెమ్యూనరేషన్ ఉన్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్‌బాస్. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా.. అన్ని ఇండస్ట్రీల్లో బిగ్‌బాస్ షో టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో ఆరు సీజన్‌లు పూర్తి చేసుకుని.. ఏడో సీజన్‌కు రెడీ అవుతోంది. అయితే బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో బిగ్‌బాస్ షో రన్ అవుతోంది. ఇక గత కొన్నేళ్లుగా హిందీ బిగ్‌బాస్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. 1,2 కాదు.. ఏకంగా 12 సీజన్లకు పైగా బిగ్‌బాస్ హోస్ట్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం నడుస్తోన్న బిగ్‌బాస్ 16కి కూడా సల్మాన్ ఖానే హోస్ట్. మన దగ్గర గత రెండు మూడు సీజన్‌లుగా బిగ్ బాస్ ఆదరణ కోల్పోతుంది కానీ.. హిందీలో మాత్రం సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 16కి మంచి రేటింగ్స్ వస్తుండటంతో.. దీన్ని మరికొన్ని రోజులు పొడిగించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌కు సంబంధించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
బిగ్‌బాస్ 16కి దక్కుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని దీన్ని మరికొన్ని రోజులు పొడిగించారు. అయితే ఈ పొడిగింపు తర్వాత సల్మాన్ ఖాన్.. బిగ్ బాస్ 16 నుంచి తప్పుకున్నాడని.. ఆయన తన ఒప్పందాన్ని కూడా పునరుద్ధరించుకోలేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. సల్మాన్ తన ఒప్పందం ప్రకారమే షో నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన ఒప్పందం ప్రకారం ముందుగా ఎన్ని రోజుల పాటు హోస్ట్‌గా ఒప్పుకున్నాడో.. అప్పటి వరకు మాత్రమే బిగ్‌బాస్ హోస్ట్‌గా చేస్తాడని.. ఆ తర్వాత తప్పుకోవాలని సల్మాన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇదే నిజమైతే వచ్చే వారం నుంచి సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్‌లో కనిపించడు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.. అటు ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. మరి నిజంగానే సల్మాన్ బిగ్‌బాస్ హోస్ట్ నుంచి తప్పుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాలి.
ఒకవేళ సల్మాన్ బిగ్‌బాస్ హోస్ట్ నుంచి తప్పుకుంటే.. మరి ఆయన ప్లేస్‌లో ఎవరు వస్తారు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటినులు. అయితే సల్మాన్ స్థానంలో.. అంతకుముందు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కరణ్ జోహార్.. బిగ్‌బాస్ సీజన్ 16కు హోస్ట్‌గా వ్యవహిరస్తాడని వార్తలు వెలువడుతున్నాయి. కరణ్‌తోనే ఈ సీజన్‌లో మిగిలిన ఎపిసోడ్స్ హోస్ట్ చేయించనున్నారని ప్రచారం సాగుతోంది.
అయితే బిగ్‌బాస్ షో ప్రెడిక్షన్స్ చెప్పే ‘ఖబ్రీ’ మాత్రం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో సల్మాన్ ఖాన్ ప్లేస్‌లో ఫరాఖాన్ షో హోస్ట్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. అలానే ఒప్పందం ప్రకారం.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి కూడా సల్మాన్ ఖానే హోస్ట్ అని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 16కు విపరీతమైనప్రేక్షకాదరణ ఉండటంతో.. కలర్స్ టీవీ, ఎండెమోల్ ఇండియా.. బిగ్ బాస్ 16ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేని 2023, ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు.