సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అభిమానులతో పాటు.. సామాన్యులకు చాలా ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలాంటి వార్తలపై జనాలు ఆసక్తి ఎక్కువగా కనబరుస్తుంటారు. ఇక ఎవరైనా సెలబ్రిటీ కపుల్ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తే.. చాలు.. వారు విడిపోయారు.. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు పుట్టుకోస్తాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తలపథి విజయ్‌కు సంబంధించి ఇలాంటి వార్తే ఒకటి జోరుగా ప్రచారం అవుతోంది. అదేంటంటే.. విజయ్ తన భార్య సంగీత విడిపోతున్నారంటూ.. కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
విజయ్-సంగీతలది ప్రేమ వివాహం. తన అభిమానినే విజయ్.. ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఎన్నో కష్టాలు ఓర్చుకుని.. అడ్డంకులను దాటుకుని.. మరి వారి ప్రేమను గెలిపించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 22 ఏళ్లుగా వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. అలాంటిది ఉన్నట్లుండి.. ఈ జంట గురించి.. రెండు మూడు రోజులుగా మీడియాలో బోలేడు వార్తలు కనిపిస్తున్నాయి. వీరు విడిపోయారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అసలు ఈ వార్తలు రావడానికి కారణం ఏంటంటే..
కొన్ని రోజుల క్రితం నిర్వహించిన వారీసు ఆడియో, ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సంగీత రాలేదు. విజయ్ మాత్రమే.. ఈ కార్యక్రమంలో కనిపించాడు. సరే.. అది సినిమా ఫంక్షన్ కనుక రాలేదు అనుకోవచ్చు. కానీ దర్శకుడు అట్లీ ఇంట్లో జరిగిన ఓ వేడుకకు కూడా విజయ్ మాత్రమే హాజరయ్యాడు.. సంగీత కనిపించలేదు. ఇక కొన్ని రోజులుగా.. సంగీత-విజయ్ జంటగా కనిపించలేదు. దాంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని.. త్వరలోనే వారు విడిపోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి.
అయితే విజయ్ సన్నిహితులు మాత్రం.. ఈ వార్తలను ఖండించారు. విజయ్-సంగీత విడిపోలేదని.. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉందని చెప్పుకొచ్చారు. పిల్లలతో కలిసి సంగీత.. అమెరికాలో హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిందని.. అందుకే ఫంక్షన్‌లలో విజయ్ మాత్రమే కనిపిస్తున్నాడని తెలిపారు. త్వరలోనే ఆమె అమెరికా నుంచి వస్తుందన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు. విజయ్-సంగీతల మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. ఇక విజయ్ నటించిన వారీసు చిత్రం.. వారసుడు పేరుతో.. తెలుగులో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా.. డిసెంబర్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సెలబ్రిటీల గురించి ఇలాంటి పుకార్లు ప్రచారం చేయడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.