తమిళ నటుడు విజయ్ సేతుపతిపై బెంగుళూరు విమానాశ్రయంలో జరిగిన దాడి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ సేతుపతి బెంగుళూరు చేరుకొని పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించడానికి వెళ్ళడం.. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత విజయ్ సేతుపతిని చూసిన ఒక వ్యక్తి కోపంతో వెనక నుండి వచ్చి ఎగిరి తన్నడం వీడియోలో చూశాము. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు కేరళ కు చెందిన జాన్సన్ గా గుర్తించారు. అతడు బెంగళూరులో ఉద్యోగం నిమిత్తం ఉంటున్నట్టు విచారణలో వెల్లడైంది.
తాజాగా దీనిపై విజయ్ సేతుపతి స్పందించారు. తనపై దాడికి దిగిన వ్యక్తి తమతో పాటే విమానంలో ప్రయాణించాడని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి, తన సిబ్బందికి మధ్య విమానంలోనే గొడవ మొదలైందని, విమానం దిగిన తర్వాత కూడా వివాదం కొనసాగిందని వివరించారు. అతడు మద్యం సేవించి ఉన్నాడని.. చిన్న విషయంపై జరిగిన గొడవలో సహనం కోల్పోయాడని, ఆ పరిస్థితిలోనే దాడి చేశాడని, అయితే ఈ వివాదాన్ని పోలీస్ స్టేషన్ లో పరిష్కరించుకున్నామని విజయ్ సేతుపతి వెల్లడించారు.
తనకు భద్రతా సిబ్బందిని నియమించుకోవడం ఇష్టముండదని, ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో వ్యవహరించడమే తనకు తెలుసని స్పష్టం చేశారు. ఎప్పుడు ప్రయాణించినా, తన క్లోజ్ ఫ్రెండ్ వెంటే ఉంటాడని, అతడే తనకు మేనేజర్ కూడా అని వివరించారు. కొన్ని సార్లు అభిమానుల నుంచి ప్రేమ లభిస్తుంది.. వ్యతిరేకత ఎదురవుతుందని.. వాటిని సున్నితంగా తీసుకోవాలని అన్నారు. అయితే విజయ్ సేతుపతి అభిమానులు మాత్రం దాడి విషయంపై ఆగ్రహంతో ఉన్నారు.
Actor #VijaySethupathi attacked in Bengaluru Airport. pic.twitter.com/lyJkeraFTO
— Manobala Vijayabalan (@ManobalaV) November 3, 2021