రవితేజ తాజా చిత్రం రావణాసుర ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, అదే సమయంలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. సినిమాలో హీరో క్యారెక్టర్‌ను హైలెట్ చేసేందుకు సీతమ్మ వారిని తగ్గించేలా డైలాగ్‌లు చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సినిమాల్లో హీరోను ఎలివేట్ చేయటం కోసం హీరోతో మాస్ మసాలా డైలాగ్‌లు చెప్పించటం మొదటినుంచి వస్తోంది. ఆ డైలాగ్‌ల కారణంగా సినిమా సూపర్ హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. డైలాగ్ పేరు చెబితే చాలు సినిమా పేరు చెప్పేయొచ్చు. అంతలా ఆ డైలాగ్‌లు జనాల బుర్రలో గుర్తుండిపోయాయి. ముఖ్యంగా మాస్ హీరోలకు డైలాగ్‌లతో ఓ అవినాభావ సంబంధం ఉంది. వారు సినిమా చేస్తున్నారంటే.. ఆ సినిమాలో కనీసం రెండు మూడన్నా మాస్ డైలాగ్‌లు ఉండాల్సిందే. అలా మాస్ డైలాగ్‌లకు పేరుగాంచిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ట్రైలర్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమాలో హిందువులు దైవంగా భావించే సీతమ్మ వారిపై డైలాగ్ ఉండటమే. ఈ సినిమాలో ‘ సీతను చేరుకోవాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటాలి’ అన్న డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్‌ను రవితేజ చెబుతాడు. డైలాగ్ సీతమ్మ వారిని తక్కువ చేసే విధంగా ఉండటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఆ మహాతల్లి జీవితంలోని విషాద ఘట్టాన్ని వాడుకోవటం ఏంటని మండిపడుతున్నారు. రావణాసురుడి బలాన్ని చెప్పటం కోసం సీతమ్మను తక్కువ చేసి చూపాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై విరుచుకుపడుతున్నారు.
సినిమా పేరు రావణాసుర అని పెట్టి.. నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయటానికి అసందర్భంగా సీతమ్మను తెరపైకి తేవటం బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడి బలం గురించి చెప్పాలంటే.. రామాయణంలో కొన్ని వందల సంఘటనలు ఉన్నాయని, వాటిని కాదని సీతమ్మ వారికి సంబంధించిన సంఘటనను ఉపయోగించటం బాధాకరమంటున్నారు. హిందూ దేవుళ్లపై ఎదైనా డైలాగులు చెప్పే ముందు కొంచెం తెలివి ఉపయోగించాలని బుద్ధి చెబుతున్నారు. మరి, రావణాసుర సినిమాలో సీతమ్మ వారిపై డైలాగ్ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.