ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన వాహనాలు, వస్తువులను బహుమతులుగా ఇవ్వడం చూస్తున్నాం. చాలా గ్యాప్ తర్వాత హిట్ వచ్చిందనే ఆనందంలో కొందరు.. హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో, హీరోతో ఇంకో సినిమా చేయొచ్చని మరికొందరు నిర్మాతలు ఖరీదైన గిఫ్టులు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు మాత్రం తమకు బాగా దగ్గరైన వారికి, ఎంతోకాలంగా తమకోసం పని చేస్తున్న వర్కర్లను గుర్తించి ఏదోకటి సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇటీవల అల్లు అర్జున్ తన డ్రైవర్ కి సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా హెల్ప్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాస్ రాజా రవితేజ తన మంచి మనసు చాటుకున్నాడు.
రవితేజ వద్ద ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వ్యక్తికి.. సరికొత్త టాటా కంపెనీకి చెందిన కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎంతో ఆనందంతో రవితేజ వద్ద పనిచేస్తున్న ఆ వ్యక్తి.. తన ఫ్యామిలీతో కలిసి కారు వద్ద ఫోటోలు దిగిన విజువల్స్ తో పాటు.. ఆ కారును మొదట రవితేజనే డ్రైవ్ చేసిన విజువల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన వర్కర్ కష్టాన్ని గుర్తించి.. అతనికి ఏదోకటి చేయాలని రవితేజ కొత్త కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. తన వర్కర్ ని పక్కన కుర్చోబెట్టుకొని క్యారవాన్ వరకు రవితేజనే డ్రైవ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. రవితేజ తన తదుపరి సినిమా ‘ధమాకా’ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ నెల 23న ధమాకా రిలీజ్ కాబోతుంది.