జయప్రద.. అందం, అభినయం రెండింటి కలబోత. కొన్న ఏళ్ల పాటు.. టాలీవుడ్‌ని తన అందం, నటనతో ఊర్రుతలుగించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా అందరితో నటించింది. టాలీవుడ్‌లోనే కాక.. బాలీవుడ్‌లో కూడా రాణించింది జయప్రద. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా విజయం సాధించింది. ఈ శుక్రవారం ఆహాలో ప్రసారం కాబోయే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి జయప్రద గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జయప్రదకు సంబంధించి ఓ వార్త వెలుగు చూసింది. కోర్టు ఆమెకు షాకిచ్చింది. జయప్రదపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎందుకు ఈ వారెంట్.. అసలు ఏం జరిగింది తెలియాలంటే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంపూర్ ప్రత్యేక కోర్టు.. జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఎందుకు అంటే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణ సందర్భంగా.. జయప్రద.. కోర్టుకు హాజరు కానందుకు రాంపూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రాంపూర్‌కు చెందిన ప్రభుత్వ న్యాయవాది అమర్‌నాథ్ తివారీ మాట్లాడుతూ.. ‘‘విచారణ సమయంలో మాజీ ఎంపీ, నటి జయప్రద వరుసగా హజరు కాకపోవడం వల్ల.. కోర్టు జయప్రద తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే మాజీ ఎంపీపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదను కోర్టులో హాజరుపరచాలని.. రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఈ సందర్‌భంగా.. కోర్టు ఆదేశించింది’’ అని తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
నటి, మాజీ ఎంపీ జయప్రదపై 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి.. ఆమె మీద రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసు ఏప్రిల్ 18, 2019 న, రాంపూర్‌లోని కామ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపారియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభకు సంబంధించినది. ఈ కేసును.. వీడియో నిఘా బృందం ఇన్‌ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. అలానే.. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్‌పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో..2019, ఏప్రిల్ 19న.. ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ జయప్రద మీద రెండో కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులకు సంబంధించి.. జయప్రద.. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో.. న్యాయస్థానం ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జయప్రద తీరు సరైందేనని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.