లగ్జరీ కార్లు.. ఖరీదైన బంగళాలు.. విలాసవంతమైన జీవితాలు.. సెలబ్రిటీలు అనగానే సగటు ప్రేక్షకుడికి మదిలో మెదిలే ఆలోచనలు. అయితే వారు సెలబ్రిటీలు అయ్యాక ఇవ్వన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ వారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. అవకాశాల కోసం తిరిగే సమయంలో పడ్డ కష్టాల గురించి ఎవరికీ తెలీదు. నేనూ అలాంటి కష్టాలే పడ్డానని చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ స్టార్టింగ్ తనతో షూటింగ్ చేసి.. చివరికి వేరే హీరోయిన్స్ ను తీసుకునే వారని ఆవేదన వ్యక్తం చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్.. నార్త్ నుంచి వచ్చి సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ.. పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసింది ఈ బ్యూటీ. టాలీవుడ్ నుంచి తన మాకాం బాలీవుడ్, కోలీవుడ్ కు మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. దూసుకెళ్తోంది. ఇక రకుల్ హిందీలో నటించిన ‘ఛత్రీవాలీ’ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్ గా రకుల్ నటించింది. ఈ సందర్భంగా తన కెరీర్ స్టార్టింగ్ లో తాను ఎదుర్కొన్న విషయాల గురించి చెప్పుకొచ్చింది.
నాకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు.. దాంతో పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు అనుభవించానని రకుల్ తెలిపింది. ముంబైలో ఉండే నేను బాంద్రా, అంథేరీ ప్రాంతాల్లో ఎక్కడ ఆడిషన్స్ జరిగినా అక్కడికి వెళ్లేదాన్ని. ఆడిషన్స్ కు వెళ్లిన సందర్భాల్లో ఒక్కోసారి కారులోనే డ్రెస్సులు మార్చుకునే దాన్ని. ఇంత కష్టపడి షూటింగ్ లకు వెళితే.. చివరికి వేరే హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకునే వారని రకుల్ ఆవేదన వ్యక్తం చేసుకుంది. అయితే నేను ఇదంతా కష్టం అనుకోవట్లేదు. ఎందుకంటే.. కష్టపడకుండా సులువుగా ఏదీ దొరకదని నా ఉద్దేశం. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆత్మ విశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే.. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ప్రస్తుతం రకుల్ తమిళంలో ఇండియన్2, అయలాన్ సినిమాల్లో నటిస్తోంది.