ప్రతి మనిషి జీవితంలో విజయాలు, అపజయాలు సహజం. అలానే కెరీర్‌లో కూడా గెలుపోటములు ఎదురవుతాయి. దీనికి ఏ ఇండస్ట్రీ అతీతం కాదు. సినీ పరిశ్రమలో ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇండస్ట్రీలో అపజయాలు చవి చూడని ఆర్టిస్ట్‌లు ఉండరు అంటే అతశయోక్తి కాదు. స్టార్ హీరోకైనా సరే అపజయాలు తప్పవు. హీరో, హీరోయిన్లు, దర్శకుడు, నిర్మాత ఇలా ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరి జీవితంలో అపజయాలు ఉంటాయి. అయితే కొందరి డిక్షనరీలో మాత్రం ఫ్లాప్ అనే మాటకు తావుండదు. అపజయం వారి వంక చూడాలంటేనే భయపడుతుంది. ఆయనే దర్శక ధీరుడు, అభిమానులు, ఇండస్ట్రీ జనాలు ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే రాజమౌళి. ఈయన ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేదు. ఇక బాహుబలి చిత్రాల తర్వాత జక్కన్న రేంజ్ పాన్ ఇండియా వైడ్‌గా విస్తరించింది. తాజాగా వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం.. ఆ క్రేజ్‌ను మరింత పెంచింది. 21 ఏళ్ల సినీ కెరీర్‌లో రాజమౌళి తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం స్టూడెంట్ నెం.1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సింహాద్రి సినిమా కూడా జూనియర్‌తోనే తీశాడు. అది కూడా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత సై, విక్రమార్కుడు, యమదొంగ, ఈగ, మర్యాద రామన్న, ఛత్రపతి, మగధీర, బాహుబలి పార్ట్ 1, 2, తాజాగా వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు. ఇవన్ని సూపర్‌హిట్‌గా నిలవడమే కాక.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. యమదొంగ, మగధీర సినిమాల తర్వాత టాలీవుడ్‌లో జక్కన్న క్రేజ్ విపరీతంగా పెరిగింది. మగధీర సినిమాకు అనుకున్న దాని కన్నా ఎక్కువ ఖర్చయిందని.. కానీ విజువల్స్ చూసిన తర్వాత.. సినిమా మీద నమ్మకంతో తానే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేశానని.. ఆ సినిమా తనకు పదింతలు లాభాలు తెచ్చిపెట్టిందని తాజా ఇంటర్వ్యూల్లో అల్లు అరవింద్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
రాజమౌళి సినిమాలు అంటేనే.. కలెక్షన్లు ఆ రేంజ్‌లో ఉంటాయి. సినిమా హిట్టా.. ఫట్టా అన్నది సమస్యే కాదు.. ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనేదే ప్రధానంగా నిలుస్తోంది. ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా తీస్తే.. కనకవర్షం కురుస్తుందని నిర్మాతలు కూడా బలంగా నమ్ముతారు. అయితే ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని భారీ వసూళ్లు సాధించాయి. ఒక్క సినిమా తప్ప. మరి ఇంతకు ఆ చిత్రం ఏదంటే..
నితిన్ హీరోగా, జెనీలియా హీరోహీరోయిన్లుగా.. వచ్చిన చిత్రం సై. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌కు ఎమోషన్‌ని జోడించి.. ప్రేక్షకులు చేత విజిల్స్ కొట్టించింది. స్టూడెంట్ పవర్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమా చాటి చెప్పింది. ఇక సై చిత్రం ద్వారా రగ్బీని ప్రేక్షకులకు పరిచయం చేశాడు రాజమౌళి. క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. అయితే సినిమా సూపర్ హిట్‌గా నిలిచినప్పటికి.. వసూళ్ల విషయంలో మాత్రం ఆశించినమేర రాణించలేదట. రాజమౌళి సినిమా అంటే.. పెట్టినదానికంటే.. 5-6 రెట్లు ఎక్కువ వసూలు చేస్తుందనే నమ్మకం అప్పటికే ఇండస్ట్రీలో బలపడింది. కానీ దానికి భిన్నంగా సై సినిమా కలెక్షన్లు ఉన్నాయి. సై సినిమా కోసం 5-6 కోట్లు ఖర్చు చేయగా.. విడుదలైన తర్వాత కేవలం 9 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక రాజమౌళి కెరీర్‌లోనే అత్యంత తక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా సై సినిమా నిలిచింది.