తెలుగు నిర్మాతల మండలిలో ఫిబ్రవరి 19న ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు అధ్యక్షులు, సినీ నిర్మాత సి. కళ్యాణ్. నిర్మాతల మండలి ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూనే.. ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ విషయంపై సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉంది. అదెప్పుడూ బాగుండాలని కోరుకుంటాము. టీఎఫ్పీసీ కమిటీపై కావాలనే కొందరు సోషల్ మీడియాలో బురద చల్లుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నాము. నిర్మాతలు కె. సురేష్ బాబుని మూడేళ్లు, యలమంచిలి రవిచంద్ ను జీవితకాలం మండలి నుండి బహిష్కరించాం” అని చెప్పారు.
ఈ క్రమంలో నిర్మాతల మండలికి చెడ్డ పేరు తేవాలని ఎవరు ప్రయత్నించినా వదిలేది లేదని హెచ్చరించారు. కొంతమంది మండలిలో ఎన్నికలు జరగట్లేదని రాద్దాంతం చేస్తున్నారు. వచ్చే నెల 19న నిర్మాతల మండలికి ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుండి 6వ తేదీవరకు నామినేషన్ ప్రక్రియ జరగనుంది. ఇక 19న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుపుతామని, అలాగే జనరల్ బాడీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు సి కళ్యాణ్ తెలిపారు. మా కౌన్సిల్ లో ప్రెజెంట్ రూ. 9 కోట్ల ఫండ్ ఉందని, ఇన్ని ఫండ్స్ రావడానికి దాసరి నారాయణరావు సహాయ సహకారాలే కారణమని గుర్తుచేశారు.
అనంతరం ఆంధ్రాలో ఇండస్ట్రీ విషయమై మాట్లాడుతూ.. “నేను గతంలో చెబితేనే చాలామంది నన్ను కామెంట్ చేశారు. ఆంధ్రాకి సినిమా ఫీల్డ్ రాదని చెప్పావేంటి? అన్నారు. 100% అదే నిజం. ఇక్కడ ఉన్నవాళ్లు అక్కిడికి వెళ్తారా? మద్రాస్ నుండి ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డాం. గవర్నమెంట్ తెచ్చిన కొత్త జివో ప్రకారం ఓ సినిమా తీశా.. ‘RDX లవ్’ అని.. ఫుల్ సినిమా ఆంధ్రాలోనే తీస్తే 3 కోట్లు ఎక్సట్రా అయ్యింది. ఆంధ్రా నుండి నిర్మాతలకు ఏం బెనిఫిట్స్ లేవు. పాత రోజుల్లో సబ్సిడీ ఉండేది. ఇప్పుడా సబ్సిడీలు లేవు. మాకు పాత గవర్నమెంట్స్ ఇవ్వాల్సిన సబ్సిడీలే ఇంకా రాలేదు. సినిమా ఫీల్డ్ ని పాలిటిక్స్ లో థింక్ చేయకండి. వీలైనంత త్వరగా ఆంధ్రాలో నంది, తెలంగాణలో సింహ అవార్డులను ప్రదానం చేయాలని ఆయా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సి కళ్యాణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి సి. కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.