బాలీవుడ్ నుండి హాలీవుడ్ లో అడుగుపెట్టి గ్లోబల్ బ్యూటీగా పేరొందిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. కేవలం బాలీవుడ్ లోనే 60 సినిమాలకు పైగా చేసిన ప్రియాంక.. హాలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్టులకే మంచి క్రేజ్ సంపాదించుకుంది. పైగా ఇంగ్లీష్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికా కోడలుగా సెటిల్ అయ్యింది. అయితే.. ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ క్రితమే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. రీసెంట్ గా మేల్ యాక్టర్స్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిపింది. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ స్పై వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ త్వరలో రిలీజ్ కాబోతుంది.
ఇక హాలీవుడ్ లో నటులుగా ముద్ర వేస్తున్న ఇండియన్ యాక్టర్స్ లో ప్రియాంక ఒకరిగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన కెరీర్ తో పాటు ఫేస్ చేసిన అవమానాలు, బాడీ షేమింగ్ సందర్భాలు కూడా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. ప్రియాంక మాట్లాడుతూ.. “బాలీవుడ్ లో నేనెప్పుడూ సరైన రెమ్యూనరేషన్ అందుకోలేదు. నాతో నటించిన హీరోల రెమ్యూనరేషన్ లో నాకు 10% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పటికీ, రెమ్యూనరేషన్స్ లో హీరోయిన్స్, లేడీస్ అదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు బాలీవుడ్ లో చేసినా.. నాకు అదే రెమ్యూనరేషన్ ఇస్తారు. అలాగే నాతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ ఈ విషయంలో సమానత్వం ఆశించినా జరగలేదు” అని చెప్పింది.
ఈ క్రమంలో కెరీర్ ఆరంభంలో స్ట్రగుల్ అయిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. ‘కెరీర్ మొదట్లో గంటల తరబడి సెట్ లో ఖాళీగా కూర్చోబెట్టేవారు. అలా కూర్చోవడంలో ఎలాంటి తప్పు లేదేమో అనుకునేదాన్ని. కానీ, నాతో పాటు నటించిన హీరోలు మాత్రం వారు సెట్ లోకి ఎప్పుడు రావాలి, పోవాలి అనేది స్వయంగా డిసైడ్ చేసేవారు. ఆ టైమ్ లో నా శరీర రంగు చూసి బాడీ షేమింగ్ కామెంట్స్ చేసేవారు. నన్ను నల్ల పిల్లి అని పిలిచేవారు. అప్పుడే నేను అందంగా లేనేమో అనుకున్నా. మొదటిసారి నేను హీరోతో పాటు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నా. ఇది హాలీవుడ్ లోనే జరిగింది. తర్వాత ఎలా ఉండబోతుందో తెలియదు.’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రస్తుతం ఈమె మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.