ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో.. డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమాలతో ప్రభాస్ స్థాయి ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్‌కి దేశవ్యాప్తంగా అభిమానులు పుట్టుకొచ్చారు. దాంతో ప్రభాస్ రేంజ్‌కూడా పెరిగింది. ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తనతో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు దర్శకులు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్ని భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమాలే. ఇక తాజాగా ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ఆది పురుష్.
త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. రామాయణం ఇతి వృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ని ఆదివారం విడుదల చేశారు. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చేందుకు టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ వేడకను కూడా అయోధ్యలోనే నిర్వహించారు. గ్రాండ్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ని చూసిన ఆయన అభిమానులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్‌కి ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్.. నడవడానికి చాలా ఇబ్బంది పడ్డట్లు పలు చోట్ల కనిపించింది. కనీసం చెప్పులు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. ఈ క్రమంలో ప్రభాస్ మెట్లు దిగేందుకు దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ సాయం తీసుకున్నాడు. వారి చేతులు పట్టుకుని మెట్లు దిగడం, చెప్పులు వేసుకునే సందర్భంలో కూడా వారి సాయం తీసుకోవడం చేశాడు. ఈ వీడియోలు చూసిన అభిమానులు.. ప్రభాస్‌కు ఏమైంది.. ఏదైనా ప్రమాదం జరిగిందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చాలా రోజుల క్రితం ప్రభాస్‌కు మోకాలి ఆపరేషన్ జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే సర్జరీ తర్వాత ప్రభాస్ తగినంత రెస్ట్ తీసుకోలేదని.. ఆ నొప్పి మళ్లీ తిరగబెట్టిందని.. అందుకే ఇలా ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. ఇంత నొప్పిని భరిస్తూ.. కూడా షూటింగుల్లో పాల్గొంటున్నారని.. ప్రభాస్ డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొందరు అభిమానులు మాత్రం ప్రభాస్ పరిస్థితికి జక్కన్నే కారణమని విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ ఇప్పటికైనా షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చి.. రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం రెస్ట్ తీసుకునే సీన్ లేదు. సలార్, ప్రాజెక్ట్ కె వంటి భారీ చిత్రాల షూటింగ్‌తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు.