కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్టోబర్ 24న మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర ముందుకు సాగింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హీరోయిన్ పూనమ్ కౌర్.. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్ది దూరం రాహుల్ గాంధీతో కలిసి నడిచింది. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని.. దీని గురించి పార్లమెంట్‌లో మాట్లాడాల్సిందిగా రాహుల్ గాంధీని కోరానని తెలిపింది పూనమ్ కౌర్. ఇంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత అనూహ్యంగా రాహుల్ గాంధీ-పూనమ్ కౌర్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.
దీనిలో రాహుల్ గాంధీ.. పూనమ్ కౌర్ చేయి పట్టుకుని ఉన్నారు. ఇంకేముంది.. దీనిపై బీజేపీ నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేయసాగారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి. ప్రధాని మోదీ పలువురు హీరోయిన్స్‌తో కలిసి దిగి ఉన్న ఫొటోలను కాంగ్రెస్ వర్గాలు సోషల్ మీడియాలోషేర్ చేస్తూ.. ఒకరిపై ఒకరు విపరీతంగా విమర్శలు చేసుకోసాగారు. .
ఈ క్రమంలో రాహుల్ గాంధీ.. పూనమ్ కౌర్ చేయిని పట్టుకుని ఉన్న ఫోటోని.. బీజేపీ మహిళా నాయకురాలు ప్రీతిగాంధీ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. తాత అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నారంటూ పోస్ట్ చేసింది. దీనిపై పూనమ్ కౌర్ సీరియస్ అయ్యింది. ఈ ట్వీట్‌కు పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రీతిగాంధీ చేసిన ట్వీట్.. తనను పూర్తిగా కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను జారి పడబోతుంటే రాహుల్ తన చేయి పట్టుకుని.. కింద పడకుండా కాపాడారని పూనమ్ క్లారిటీ ఇచ్చింది.
అంతేకాక ప్రధాని మోదీ తరచుగా నారీ శక్తి గురించి చెబుతుంటారని.. అలాంటిది.. ఓ మహిళ గురించి ఇలా ప్రచారం చేయడం తగదు గుర్తుంచుకోండి అంటూ బీజేపీ శ్రేణులకు పూనమ్ కౌర్ సూచించింది. ఈ ఫొటోపై ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేయడం తగదని సూచించింది. ఇలాంటి పనులు మానుకోవాలని, ఇతరులను కించపరచడం మంచి పద్దత కాదని తెలిపింది. రాహుల్ గాంధీకి స్త్రీల పట్ల ఉన్న గౌరవం, శ్రద్ధ, రక్షణ స్వభావం తన హృదయాన్ని తాకిందని పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం పూనమ్ చేసిన ట్వీట్ వైరలవుతోంది.
This is absolutely demeaning of you , remember prime minister spoke about #narishakti – I almost slipped and toppled that’s how sir held my hand . https://t.co/keIyMEeqr6
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 29, 2022
ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంగా పూనమ్ కౌర్.. రాహుల్ గాంధీని కలిసింది. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నించాల్సిందిగా రాహుల్ గాంధీని కోరింది. అంతేకాక కాంగ్రెస్ అధికారంలో వస్తే చేనేత వస్తువులపై జీఎస్టీ ఎత్తివేస్తామంటూ రాహుల్ చేసిన ప్రకటనపై పూనమ్ కౌర్ ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వాలు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని, వారి సమస్యలను పరిష్కరించాలని పూనమ్ డిమాండ్ చేసింది. అంతేకాక.. ప్రభుత్వాలు చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరింది.