శివరాత్రి కాబట్టి చాలామంది ఉపవాసం ఉండటం కామన్. ఇందులో నటీనటులు కూడా ఉంటారు. అలా ఓసారి ఫాస్టింగ్ తోనే ఓ పాట షూట్ కంప్లీట్ చేశానని పూజాహెగ్డే చెప్పుకొచ్చింది.
హీరోయిన్లు బయటకు బోల్డ్ గా కనిపించినప్పటికీ.. వాళ్లు కూడా మనలాంటి మనుషులే. అందరిలానే గుడికి వెళ్లడం కుదరకపోయినప్పటికీ.. భక్తి విషయంలో మాత్రం కొందరు బాగానే పాటిస్తుంటారు. మొన్నటికి మొన్న హీరోయిన్ సమంత.. తమిళనాడులోని పళని స్వామి ఆలయంలో మెట్టుమెట్టుకు బొట్లు పెట్టడం చూశాం. మిగతా హీరోయిన్లకు ఎవరికి ఏ దేవుడిపై భక్తి ఉందని పెద్దగా తెలియదు కానీ హీరోయిన్ పూజాహెగ్డే మాత్రం తాను శివభక్తురాలిని అంటూ చెప్పుకొచ్చింది. ఓ హిట్ సాంగ్ షూటింగ్ అప్పుడు తాను ఉపవాసం ఉన్నానని రివీల్ చేసింది. ఇంతకీ ఆ సూపర్ హిట్ సాంగ్ ఏంటో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ సినిమాతో హీరోయిన్ గా మారిన ఈమె.. తెలుగులోకి ‘ఒక లైలా కోసం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ‘ముకుంద’లోనూ కనిపించి ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ తో కలిసి ‘దువ్వాడ జగన్నాథం’ మూవీతో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాలతో హిట్స్ కొట్టింది. గత మూడు నాలుగు సినిమాలు మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం తెలుగులో మహేశ్-త్రివిక్రమ్ సినిమా మాత్రమే ఈమె చేతిలో ఉంది.
హీరోయిన్ గానే కాకుండా ‘రంగస్థలం’ సినిమాలో జిగేలురాణి అనే ఐటమ్ సాంగ్ తోనూ ప్రేక్షకుల్ని ఊపేసింది. ఇక ఈ పాట శివరాత్రి రోజు రావడంతో తాను ఉపవాసం ఉన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘శివరాత్రికి ఉపవాసం ఉండటం కొన్నేళ్లుగా పాటిస్తున్నాను. ప్రతి శివరాత్రికి నాన్న ఉపవాసం ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నాను కాబట్టి నేను ఫాలో అయ్యాను. అలా ఫాస్టింగ్ చాలా ఏళ్ల క్రితం నుంచే అలవాటైపోయింది. భరతనాట్యం నేర్చుకున్నాను కాబట్టి అలా నటరాజుని కొలిచేదాన్ని. ఆ విధంగా శివుడితో నా అనుబంధం ఎప్పటినుంచో ఉంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని పాటిస్తున్నాను. జిగేలు రాణి పాటు షూట్ అప్పుడు శివరాత్రి వచ్చింది. దీంతో ఉపవాసం ఉన్నాను.’ అని పూజాహెగ్డే చెప్పుకొచ్చింది. మరి శివరాత్రికదా మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు. కింద కామెంట్ చేయండి.