తెలుగులో 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన పావలా శ్యామల.. దిక్కులేని ఆమెలా బతుకునీడుస్తుంది. అనారోగ్యం పాలై అనాథాశ్రమంలో కూతురితో కలిసి జీవిస్తోంది. ఎప్పటి నుంచో ఈమె ఆరోగ్యం సరిగా లేదు. ఆ మధ్య మా అసోసియేషన్ లో మెంబర్ షిప్ లేకపోతే చిరంజీవి లక్ష రూపాయలు కట్టి మరీ మెంబర్ షిప్ ఇప్పించారని, ఆమె కుమార్తె ఆరోగ్యం పాడైతే మరో 2 లక్షలు ఇచ్చి ఆర్థిక సాయం చేశారని పావలా శ్యామల వెల్లడించింది. ఆ డబ్బులతోనే ఇప్పటిదాకా నెట్టుకొచ్చామని ఆమె తెలిపింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తన పరిస్థితి అస్సలు బాలేదని, ఓల్డేజ్ హోంలో బతుకునీడుస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని, ఏ విధమైన బతుకుతెరువు లేదని చెప్పుకొచ్చింది. ఇంత విషం కొనుక్కొచ్చుకుని తాగడానికి కూడా శక్తి లేదని, చావడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నామని ఆమె వెల్లడించింది. అందరూ ఉచిత అనాథాశ్రమంలో ఉండచ్చు కదా అని అంటున్నారని, ఇప్పుడు ఉంటున్న అనాథాశ్రమంలో డబ్బులు కడితేనే తమని సరిగా చూడడం లేదని ఆమె తెలిపింది. ఉదయం 11 అయితేనే గానీ పనమ్మాయి రాదని, అప్పటి వరకూ తన కుమార్తె ఇబ్బంది పడుతూ ఉంటుందని ఆమె వాపోయింది. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక తనను చూసుకునేందుకు ఒక అమ్మాయిని పెట్టారని, అయితే ఆమె మధ్యలోనే సంబంధం లేదని వదిలేసి వెళ్లిపోయిందని, ఆ తర్వాత తాను బతికున్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదని ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పావలా శ్యామలకి సినీ ప్రముఖులు సాయం చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.