ఆస్కార్ వేడుక ఎంతో అట్టహసంగా జరిగింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయులకు మరపురాని అనుభవాలను మిగిల్చింది. మరి విజేతలకు ఎంత క్యాష్ ప్రైజ్ లభిస్తుంది అంటే..
యావత్ సినీ ప్రపంచం ఆత్రుతగా ఎదురు చూసిన ఆస్కార్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సారి ఆస్కార్ వేడుకలు భారతీయులకు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఏడాది మనకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇండియన్ సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. తెలుగువారి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. తెలుగు సినిమా రేంజ్ ఏంటో అంతర్జాతీయంగా నిరూపితం అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస్కార్ ఫీవర్ ఇప్పట్లో ముగియదు. ఇక నాటు నాటు ఆస్కార్ సాధించడంపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురూస్తునే ఉంది.
ఇక సినీ ప్రపంచంలో ఇంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు గెలిచిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది అనే దాని గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే ఏదో చిన్నా చితకా అవార్డులు ఇస్తేనే.. వాటితో పాటు ఎంతో కొంత నగదు పురస్కారం అందజేస్తారు. మరి అలాంటిది ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారం గెలిచిన వారికి ఎంత భారీ ప్రైజ్ మనీ ఇచ్చి ఉంటారు.. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తారో కదా అనిపిస్తుంది. మరి ఆస్కార్ విజేతలకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది అంటే.. సున్నా రూపాయలు. అవును మీరు విన్నది నిజమే. ఆస్కార్ విజేతకు లభించే ప్రైజ్ మనీ కేవలం సున్నా రూపాయలు మాత్రమే.
అదేంటి అంతటి ప్రతిష్టాత్మక పురస్కారం గెలిచిన వారికి ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదా అంటే ఉండదు. ఆస్కార్ అవార్డే అనంతమైన సంపదతో సమానం. అందుకే విన్నర్‌కి నో క్యాష్ ప్రైజ్ అన్నమాట. కానీ నామినీస్‌కి మాత్రం.. కోటి రూపాయల విలువైన గిఫ్ట్ బ్యాగ్ అందిస్తారు. ఆస్కార్ విజేతలకు ట్రోఫీ తప్ప నగదు బహుమతి ఉండదు. పైగా ట్రోఫీని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆస్కార్ అవార్డ్ గెలుచుకోని నామినీస్ ప్రతి ఒక్కరికి రూ.1 కోటి విలువైన ఉత్పత్తులతో కూడిన లగ్జరీ గిఫ్ట్ హ్యాంపర్ అందజేస్తారు.
లాస్ ఏంజిల్స్‌కు చెందిన మార్కెటింగ్ కంపెనీ ‘డిస్టింక్టివ్ అస్సెట్స్’ గత కొంత కాలంగా.. ఆస్కార్ నామినీలకు ఈ గిఫ్ట్ బ్యాగ్‌లను పంపిణీ చేస్తోంది. నాలుగు మెయిన్ యాక్టింగ్ కేటగిరీలతో పాటు బెస్ట్ డైరెక్టర్ నామినీలకు ఈ బ్యాగ్స్ ఇవ్వనున్నారు. డిస్టింక్టివ్ అస్సెట్స్ ఫౌండర్ లాష్ ఫారీ.. కొన్నేళ్ల నుంచి ఆస్కార్స్ నామినీస్‌కు ఈ గిఫ్ట్స్ అందజేస్తున్నాడు. మరి ఆస్కార్ విజేతకు ప్రైజ్ మనీ ఇవ్వలా… ఇవ్వకూడదా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.