ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు,దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు.. వారి బంధువులు కన్నుమూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. కానీ బెంగాలీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, రెండు పర్యాయాలు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న పినాకీ చౌదరి కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న పినాకీ చౌదరి సోమవారం కలకత్తాలో తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
బెంగాలీ ఇండస్ట్రీలోకి 1983 లో చెనా అచ్చెనా అనే మూవీతో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన షాంఘాత్, బాలీగంజ్ కోర్ట్ చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. నటుడి, నిర్మాత, దర్శకుడిగా బెంగాలీ ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశారు. కొంత కాలంగా లింఫోమా, శోషరస కు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చివరి రోజుల్లో తన నివాసంలో గడపాలని డాక్టర్లకు తెలపడంతో వారి సూచన మేరకు కుటుంబ సభ్యులు పినాకీ చౌదరీని ఇంటికి తీసుకు వచ్చారు. సోమవారం ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో కన్నుమూశారు. పినాకీ చౌదరి మరణ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.