సింగర్ పార్వతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మారుమూల పల్లెలో జన్మించిన పార్వతి.. ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తోన్న పాటల పోటీలో పాల్గొన్నది. కోకిల కన్నా మధురంగా ఉన్న ఆమె గాత్రానికి జడ్జీలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఏం కావాలో కోరుకో అంటే.. తన ఊరికి బస్సు లేదని.. దాని వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడ్డానో వివరించిన పార్వతి.. తన ఊరికి బస్సు వచ్చేలా చూడమని కోరింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పార్వతి కోరిక నెరవేరింది. ఆమె గ్రామానికి బస్సు వచ్చింది. అయితే పార్వతి గ్రామానికి బస్సు రావడం వెనక మంత్రి పేర్ని నాని, బొత్స సత్యనారాయణల కృషి ఎంతో ఉందట. ఆ వివరాలు..
ఓ చానెల్‌లో ప్రసారం అయిన పాటల కార్యక్రమంలో ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి.. అనే పాటతో తన గొంతు వినిపించి జడ్జీల మనసు గెలుచుకుంది పార్వతి. ఆమె గాత్రానికి ముగ్ధుడైన సంగీత దర్శకుడు కోటి.. ‘నీకేం కావాలమ్మా’ అని అడిగారు. అందుకు పార్వతి ‘నాకేం వద్దు సార్.. మా ఊరికి బస్సు వస్తే చాలని’ చెప్పి.. ఈ పల్లెకోకిల తన పెద్ద మనసు చాటుకోవడంతో ఆమె కోరికను నెరవేర్చింది ఏపీ ప్రభుత్వం.
ఊరికి బస్సు రావడం అంటే మాటలు కాదు.. దానికి అధికారుల పర్మిషన్.. రోడ్డు వ్యవస్థ.. రవాణా వ్యవస్థ ఇదంతా పెద్ద తతంగం. అయితే ఈ పనులన్నీ ఒక్క వారంలో కంప్లీట్ అయ్యేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది మాత్రం ఆ ఇద్దరు మంత్రులే అంటున్నారు సంగీత దర్శకుడు కోటి. రాజకీయాలను పక్కన పెట్టి.. ఈ విషయంలో ప్రభుత్వం చూపిన చొరవను అభినందించాలంటూ మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించారు కోటి.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘ఆడపిల్లలని నేను బాగా ఎంకరేజ్ చేస్తాను. అందుకే పాటల పోటీల్లో వాళ్లు బాగా పాడితే.. ఏం కావాలని అడుగుతాను. చాలా మంది బంగారం, వేరే వస్తువులు అడిగారు. అలానే పార్వతిని అడిగాను. ఆమె ఇవేమీ కోరుకోలేదు.. మా ఊరికి బస్సు కావాలని అడిగింది. ఆ మాటతో మేమంతా షాక్ అయిపోయాం. ఎందుకు అని అడిగినప్పుడు బస్సు లేక ఆమె ఎంత కష్టపడింది.. ఆ ఊరు వాళ్లు ఎంత కష్టపడుతున్నారు అని చెప్పుకొచ్చింది. పార్వతి మాటలు విన్న స్మిత ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది’’ అని తెలిపారు.
‘‘అప్పటికే నేను దీని గురించి మంత్రి బొత్ససత్యనారాయణతో మాట్లాడాను. కానుమూరి నాగేశ్వరరావుగారితో చెప్పి ఎలాగైనా బస్సు రప్పించాలి అని కోరాను. ఇక సింగర్ స్మిత కూడా.. మంత్రి పేర్ని నానితో మాట్లాడింది. ఆయన చాలా బాగా స్పందించారు.. కళాకారులకు ఏపీ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో చెప్పడానికి ఇదొక్క సంఘటన చాలు. నేను పొలిటికల్‌గా మాట్లాడటం లేదు.. ఒక చిన్నపిల్ల.. మట్టిలో మాణిక్యం లాంటి అమ్మాయి.. తన గురించి కాక.. ఆమె ఊరికోసం ఆలోచించింది’’ అని కోటి ప్రశంసలు కురిపించారు
‘‘విషయం తెలిసి.. పేర్ని నాని గారు.. వెంటనే ఆన్ లైన్‌లోకి వచ్చి మాతో మాట్లాడారు. తప్పకుండా చేద్దాం అని హామీ ఇచ్చారు.. బస్సు వేసి చేసి చూపించారు. ప్రతిరోజు కష్టం కానీ.. వారానికి రెండు మూడుసార్లు అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు.. కళాకారులకు ఉండే విలువ ఇది’ అంటూ చెప్పుకొచ్చారు కోటి. తన గాత్రంతో ఊరికి బస్సు తీసుకొచ్చింది పార్వతి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.