సాధారణంగా సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందినవారికి కొంతమంది అగంతకులు బాంబు బెదిరింపు కాల్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. బెదిరింపు కాల్స్ తర్వాత పోలీసులు ఎంక్వేయిరీలో అవన్నీ ఫేక్ అని తేలిపోతున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలో మాఫియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మాఫియా డాన్ లు పుట్టుకొస్తూనే ఉన్నారు. ముంబాయి నగరంలో సినీ, రాజకీయ నేతల ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు ఇలా ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబు బెదిరింపు కాల్స్ రావడం చూస్తూనే ఉంటాం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, ధర్మేంద్ర లతో పాటు వ్యాపార దిగ్గజం అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతంలో వీరిద్దరూ కలిసిన నటించిన ‘షోలే’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని అగంతకుడు ఫోన్ చేసి ఇద్దరు హీరోల ఇళ్లకు బాంబు పెట్టి పేల్చేస్తామని బెదించాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించగా ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదని వెల్లడించారు.
అమితాబచ్చన్, ధర్మేంద్ర తో పాటు యాంటిలియాలోని ముఖేష్ అంబానీ ఇంటికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక ముంబాయిలోకి భారీ సంఖ్యలో ఆయుధాలతో ఉగ్రవాదులు చొరబడ్డారని.. త్వరలో పెను విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారని.. వారు ముంబాయిలోని దాదార్ కు చేరుకున్నారని అగంతకుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే జుహు, విల్లే పార్లే లతో పాటు స్టార్ హీరోలు, ప్రముఖ వ్యాపారు నివాసాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. ముంబైలో హీరోగా మారిన తర్వాత అమితాబచ్చన్ మొదటిసారిగా కొన్న ప్రాపర్టీ ప్రతీక్ష. ఇక యాక్షన్, రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర జుహు లో ఉంటున్నారు. ఇటీవల పలుమార్లు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.