బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ నటి కంగనా రౌనత్. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. ముక్కుసూటిగా మాట్లాడే ఈ అమ్మడికి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల కంగన రనౌత్‌పై పాటల రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ జరుపుతున్న అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగానే వ్యవహరించారని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు చెప్పింది.
ఈ పిటిషన్పై విచారణను వేరొక కోర్టుకు బదిలీ చేయాలని కంగనా దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. కంగన దరఖాస్తును తోసిపుచ్చుతూ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్‌టీ దండే గురువారం తీర్పు చెప్పారు. ఈ ఆదేశాలు శనివారం పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. కంగనపై జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ జరుపుతున్న అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా, వివేకంతో వ్యవహరించారని దండే తెలిపారు. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించినంత మాత్రానికి కంగనకు వ్యతిరేకంగా ఉన్నట్లు కాదని చెప్పారు.
కంగనకు వ్యతిరేంగా ఎటువంటి పక్షపాతం ప్రదర్శించలేదన్నారు. కాగా, కంగన దాఖలు చేసిన దరఖాస్తులో, తనకు అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుపై నమ్మకం పోయిందని తెలిపారు. బెయిలు మంజూరు చేయదగిన నేరానికి సంబంధించిన కేసులో కోర్టుకు హాజరుకాకపోతే తనకు వారంట్ జారీ చేస్తామని పరోక్షంగా ఈ కోర్టు బెదిరించిందని ఆరోపించారు. దీనిపై దండే స్పందిస్తూ… అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కంగనకు న్యాయమైన అవకాశాలు ఇచ్చిందన్నారు.అయితే కంగనా రనౌత్ ఆరోపణలను అందేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది.