Madhavan: హీరో మాధవన్ ప్రస్తుతం తాను నటించి, తెరకెక్కించిన ‘రాకెట్రీ’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హీరో సూర్యతో వీడియో చిట్ చాట్ లో పాల్గొన్నాడు. ఇద్దరూ చాలాసేపు పలు కీలక విషయాలు షేర్ చేసుకున్న తర్వాత.. మాధవన్ గజిని మూవీ గురించి ప్రస్తావించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. గజిని మూవీ ఆఫర్ మొదటగా తనకే వచ్చిందని.. కానీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు.
వీడియో చాట్ లో మాధవన్ మాట్లాడుతూ.. “గజిని సినిమా ఆఫర్ నాకు కూడా వచ్చింది. కథ నచ్చకపోవడంతో సినిమాని రిజెక్ట్ చేశాను. మురుగదాస్ సర్ కథ చెప్పినప్పుడు సినిమా సెకండాఫ్ నాకు కనెక్ట్ కాలేదని చెప్పాను. ఆ కథ చివరికి నీ దగ్గరికి వచ్చింది. ఆ రోల్ లో మిమ్మల్ని చూశాక సంతోషించాను. నేను మిమ్మల్ని అంతకుముందు ‘కాఖా కాఖా’లో చూశాను. గజినిలో మిమ్మల్ని చూశాక ఆ పాత్ర సరైన వ్యక్తి దగ్గరికి వెళ్లిందని భావించాను. ఆ విషయాన్ని మీరు కూడా ప్రూవ్ చేశారు.
గజిని సినిమా చాలా పెద్ద విషయం. సినిమాలో మీ పాత్ర కోసం మీరు పడిన కష్టం.. మీ సిక్స్ ప్యాక్ వెనుక కష్టాన్ని నేను చూశాను. ఆ సమయంలో, మీరు కష్టపడిన తీరు చూసి నేను ఇలా చేయగలనా అని ఆశ్చర్యం కలిగింది. మీ శరీరాకృతి కోసం మీరు దాదాపు ఒక వారం పాటు ఉప్పు(సాల్ట్ ఫుడ్) తీసుకోలేదని నాకు బాగా గుర్తుంది. మీరు కష్టపడిన తీరు నాలో ఆసక్తిని పెంచింది. అప్పటినుండి నేను చేస్తున్న పని గురించి నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను.
అదే సమయంలో నా కెరీర్‌కు, నా సినిమాలకు నేను తగినంత న్యాయం చేయడం లేదని నేను నిజంగా భావించాను. ఆ తర్వాతే, నేను మీరు ఇచ్చిన సలహాలను పాటించడం ప్రారంభించాను. నేను మిమ్మల్ని ఉదాహరణగా తీసుకున్నాను సూర్య. ఇక, గజినీ తర్వాత మీ కెరీర్‌లో అసలు చరిత్ర మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్దగా స్నేహితులు లేరు కాబట్టి.. మీతో, జ్యోతికతో గడిపిన తర్వాత మంచి స్నేహితులు అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఎలాంటి షరతులు లేకుండా ఉండటమే నిజమైన స్నేహితులు చేసే పని. ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఈ వయస్సులో అలాంటి స్నేహాన్ని పొందడం చాలా కష్టం. కానీ, నాకు ఏ అవసరమున్నా మీరుంటారు.” అంటూ సూర్యతో చెప్పుకొచ్చాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.