ఈ మధ్య కాలంలో యావత్ దేశాన్ని షేక్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘కాంతార’ మాత్రమే. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఓ ప్రాంతీయ చిత్రం.. ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో ఇది ప్రూవ్ చేసింది. ఇక ఇందులో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా అంతా ఎలా ఉందనేది పక్కనబెడితే, క్లైమాక్స్ లో పదిహేను నిమిషాల ఎపిసోడ్.. ఇప్పటికీ ఆడియెన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అక్కడ వచ్చే సాంగ్.. మనల్ని ‘కాంతార’ లోకంలో లీనమయ్యేలా చేసింది. ఇకపోతే ఇప్పుడు ఆ పాట కాపీ అంటూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థ తీసిన కన్నడ చిత్రం ‘కాంతార’. తొలుత దీన్ని ఒక్క భాషలో మాత్రమే రిలీజ్ చేశారు. అయినా సరే క్రేజ్ నెక్స్ట్ లెవల్ వచ్చింది. దీంతో దక్షిణాదితోపాటు హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ భాషల్లో కన్నడ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. తెలుగులోనూ విడుదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఇకపోతే ‘కాంతార’ క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహ రూపం’ సాంగ్.. తమ ‘నవరస’కు కాపీ అని ‘తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేసింది. తమకు మద్ధతు తెలపాలని సోషల్ మీడియా యూజర్స్ ని కోరింది.
‘కాంతార చిత్రానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా సాంగ్ ‘నవరస’, ‘కాంతార’లో వరహ రూపం పాట మధ్య సారుప్యతలు పూర్తిగా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమే. ఈ కాపీకి కారణమైన వాళ్లపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం’ అని తైక్కుడం బ్రిడ్జ్ పేర్కొంది. ఈ పోస్టులో కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్, దర్శకుడు రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్స్ విజయ్ కిరంగదూర్ లని ట్యాగ్ చేసింది. దీనిపై వీళ్లు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ‘తైక్కుడం బ్రిడ్జ్’ బ్యాండ్ ని మలయాళ సంగీత దర్శకుడు గోవింద్ వసంత, సింగర్ సిద్ధార్థ్ మేనన్ స్థాపించారు. మరి ‘కాంతార’ టీంకు లీగల్ నోటీసులు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.