కేజీఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ సంచలనానికి తెరతీసింది. భారత సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. హీరో, హీరోయిన్.. ప్రధాన పాత్రధారులకు మాత్రమే కాదు.. ఈ సినిమాలో నటించిన చిన్న చిన్న పాత్రలకు కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అలా కేజీఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కేజీఎఫ్ తాత కృష్ణ జీ రావు ఒకరు. సినిమాలో ఓ అంధుడి పాత్రలో ఆయన కనిపించారు. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఆయన పాత్రకు మంచి ఆధరణ లభించింది. దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయారు. ఇక అప్పటినుంచి సినిమా అవకాశాలు కూడా ఆయన్ని చుట్టుముట్టాయి.
దీంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఓ సినిమాలో లీడ్ రోల్‌లో కూడా నటించారు. సినీ జీవితం ప్రశాంతంగా నడిచిపోతున్న ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యం పాలయ్యారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణ జీ రావు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయన్ని అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ ఫొటో చూస్తున్న ఆయన అభిమానులు, నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా, కృష్ణ జీ రావు చిన్న పల్లెటూరులో పుట్టారు. నటన మీద ఆసక్తితో 30 ఏళ్ల క్రితం బెంగళూరు వచ్చారు. టైలర్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్ ఇలా చాలా పనులు చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు కథా రచన కూడా చేశారు. ఇలాంటి సమయంలోనే ప్రొవిజినల్ మేనేజర్ కుమార్ కేజీఎఫ్ సినిమా కోసం ఫొటో పంపించమని కృష్ణాజీని అడిగారు. కానీ, ఆయన స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉండి యాక్టింగ్ నాకెందుకు అనుకున్నారు. అయితే, ఓ రోజు కుమార్ స్వయంగా కృష్ణాజీ ఫొటోను కేజీఎఫ్ ఆడిషన్స్‌కు పంపారు. దీంతో ఆయన కేజీఎఫ్‌కు సెలెక్ట్ అయ్యారు.