మూకీతో మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించింది. నాడు భీష్మ ప్రతిజ్ఞతో తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టిన రఘుపతి వెంకయ్య నాయుడు దగ్గరినుంచి నేటి తరం వరకు ఎంతో మంది సినిమా ఉన్నతికి కృషి చేశారు. మరెంతో మంది నటీనటులు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖించారు. తమదైన శైలి నటనతో ప్రేక్షకులను కొన్ని దశాబ్ధాల పాటు మెప్పించారు. ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికి, ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అలాంటి వారిలో దివంగత నటుడు కత్తి కంతారావు ఒకరు.
జానపద సినిమాలకు, కత్తి ఫైట్లకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కొన్ని దశాబ్ధాల పాటు జానపద చిత్రాల రారాజుగా వెలుగొందారు. జానపద చిత్రాల్లో కత్తి కాంతారావును ఢీకొట్టే హీరో లేడు అనిపించుకున్నారు. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది ఎప్పుడూ మారుతూ.. మనుషుల్లో మార్పు తెస్తూ ముందుకు సాగుతుంది. ఆ మార్పే కత్తి కాంతారావును కష్టాల్లో పడేసింది. హీరోగా పిచ్చపాటి స్టార్‌డమ్‌ను రుచి చూసిన ఆయన ఊహించని విధంగా తన ప్రభను కోల్పోయారు. అప్పులపాలై చివరి రోజుల్లో దయనీయ స్థితిలో చనిపోయారు.
కత్తి కాంతారావు జీవితాన్ని మార్చిన సురభి డ్రామా కంపెనీ..
కత్తి కాంతారావుకు చిన్నప్పటినుంచి నటన అంటే ఆసక్తి ఉన్నా దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఓ సారి ప్రముఖ డ్రామా కంపెనీ ‘‘సురభి’’.. కాంతారావు గ్రామమైన నల్గొండ జిల్లాలోని కోదాడలో ప్రదర్శన ఇచ్చింది. సురభి డ్రామా కంపెనీ వారి ప్రదర్శనకు కంతారావు ముగ్ధులయ్యారు. ఎలాగైనా తాను కూడా అలా నాటకాలు వేయాలనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా ఓ నాటక మండలిని ఏర్పాటు చేశారు. దానికి ‘‘బాల మిత్ర నాట్య మండలి’’ అని పేరు పెట్టారు. తన మిత్రులతో కలిసి ఆ నాట్య మండలి ద్వారా ‘‘గయోపాఖ్యానం’’..‘‘మధు సేవా’’ నాటకాలు వేసేవారు. అంతేకాదు! సురభి నాటక కంపెనీలో కూడా ఆయన నాటకాలు వేశారు. ‘‘ శ్రీ కృష్ణ లీలలు’’ నాటకంలో బ్రహ్మ పాత్ర పోషించారు. దీనితో పాటు మధుసేవా, కనకధారా, తెలుగు తల్లి నాటకాల్లో నటించారు.
సినిమాల మీద ఆసక్తితో మద్రాస్‌కు..
నాటకాలు వేస్తున్న సమయంలోనే ఆయన మిత్రులు కంతారావుకు సినిమాల్లోకి వెళ్లమని సలహా ఇచ్చారు. కాంతారావు ఆసక్తి సినిమాల వైపు మళ్లటంతో మద్రాస్ చేరుకున్నారు. అక్కడ ప్రముఖ దర్శకుడు హెచ్‌ఎమ్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న టీ కృష్ణమాచారితో కలిసి ఉండేవారు. ఈ నేపథ్యంలోనే కాంతారావు, హెచ్‌ఎమ్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. కాంతారావుకు సినిమాల మీద ఉన్న ఆసక్తిని గమనించిన రెడ్డి 1951లో వచ్చిన ‘‘ నిర్ధోషి’’ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత హెచ్‌ఎమ్ రెడ్డే కాంతారావును హీరో చేశారు. కాంతారావును హీరోగా పెట్టి 1953లో ‘‘ప్రతిజ్ఞ’’ సినిమా చేశారు. ఆ తర్వాతినుంచి కాంతారావు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
జానపద చిత్రాల రారాజు.. తెలుగు సినిమాకు కత్తి కాంతారావు
మూడవ సినిమా నుంచి కాంతారావు ప్రయాణం ఎక్కువగా ఎన్టీ రామారావుతో సాగింది. ఎన్టీఆర్ నిర్మించి, నటించిన ‘‘జయసింహ’’ దగ్గరినుంచి చాలా సినిమాల్లో కాంతారావుకు ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. కత్తి కాంతారావు కూడా ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రధాన పాత్రల్లో నటించేవారు. ప్రముఖ జానపద చిత్రాల దర్శకుడు బి.విఠలాచార్య తీసిన సినిమాల్లో ఎన్టీఆర్ తర్వాత కాంతారావే ఎక్కువ సార్లు హీరోగా చేశారు. ఈ నేపథ్యంలోనే కత్తి ఫైట్లలో తన దైన ముద్ర వేసుకున్నారు. కత్తి ఫైట్లలో కాంతారావుకు పోటీ వచ్చే వారు ఎవరూ లేరూ అనిపించుకున్నారు. అంతేకాదు! జానపద చిత్రాల రారాజుగా వెలుగొందారు. ఎన్టీఆర్ కంటే ఎక్కువ జానపద సినిమాల్లో కాంతారావు నటించారు.
జానపద ముద్రే కత్తి కాంతారావు కొంపముంచింది..
జానపద చిత్రాల రారాజుగా పేరొందిన కంతారావును ఆ పేరే కొంప ముంచింది. కాంతారావు ఎక్కువగా జానపద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. చాలా మంది దర్శకులు, నిర్మాతలు కాంతారావు కేవలం జానపద సినిమాలకు మాత్రమే బాగుంటాడని భావించేవారు. తమ సినిమాలకు కాంతారావును ఎక్కువగా ఫ్రిపర్ చేసేవారు కాదు. దీంతో రోజురోజుకు హీరోగా ఆయనకు సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దానికి తోడు జానపద సినిమాల హవా కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కాంతారావు ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు చేయటం మొదలుపెట్టారు.
సినిమా నిర్మాణంతో అప్పుల పాలై..
హీరోగా అవకాశాలు తగ్గుతున్న టైంలోనే ఓ ఆలోచన కత్తి కాంతారావును పతనం వైపు నడిపించింది. తోటీ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ లాగా తాను కూడా సినిమా నిర్మాణం చేపట్టాలని ఆయన భావించారు. ‘‘సప్త స్వరాలు’’ పేరిట ఓ సినిమాను నిర్మించి, నటించారు. 1969లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా పరాజయం పాలైంది. అయినా కాంతారావు సినిమా నిర్మాణాన్ని ఆపలేదు. గండర గండుడు, ప్రేమ జీవులు తీశారు. ఈ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో అప్పులు మిగిలాయి. అయినా కూడా ‘‘ గుండెలు తీసిన మొనగాడు’’ సినిమా చేశారు. ఈ సినిమా బాగానే ఆడినా అప్పులు మాత్రం తీరలేదు. చివరగా నిర్మించిన ‘‘స్వాతి చినుకులు’’ కూడా ప్లాప్ అయింది. ఈ సినిమాల నిర్మాణం కోసం కాంతారావు ఉన్న ఆస్తులను అమ్మారు. దీంతో ఉన్నదంతా పోయి అప్పులు మిగిలాయి.
చివరి రోజుల్లో వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు.. శాపంగా మారిన క్యాన్సర్..
సినిమా నిర్మాణంతో మిగిలిన అప్పులు చనిపోయే వరకు కాంతారావును వెంటాడాయి. దీనికి తోడు ఆరోగ్యం కూడా క్షీణించింది. క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఏదో బతకటానికి అన్నట్లు అడపాదడపా సినిమాలు చేసేవారు. 2008లో చివరగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘‘పాండు రంగడు’’ సినిమాలో నటించారు. క్యాన్సర్ వ్యాధి ముదరటంతో ఆసుపత్రికే పరిమితం అయ్యారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది. చివరి రోజుల్లో ఆయన యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 2009 మార్చి 22న తుది శ్వాస విడిచారు.
ఆర్థిక ఇబ్బందుల్లో కాంతారావు కుటుంబం.. పట్టించుకోని ప్రభుత్వం, పరిశ్రమ!
తెలుగులో దిగ్గజ తారగా ఓ వెలుగు వెలిగిన కాంతారావు కుటుంబం ఎలాంటి ఆదరణకు నోచుకోవటం లేదు. నేడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. సహాయం కోసం ఎదురుచూస్తోంది. సినిమా పరిశ్రమ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదంటూ కాంతారావు కుమారుడు రాజా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా నిర్మాణంతో తన తండ్రి ఆస్తులను ఆమ్మేశాడని, అప్పులు మిగిలాయని వెల్లడించారు. తండ్రి చనిపోయిన తర్వాత తమ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె ఇంట్లో బతుకుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమ తమను ఆదుకోవాలని కోరారు.
కాంతారావుకి తెలుగుజాతి ద్రోహం చేస్తోందా?..
తెలుగు సినిమాకి నడక నేర్పిన మహనుభావులలో కాంతారావు కూడా ఒకరు. NTR, ANR లతో సమానమైన క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి కాంతారావు కుటుంబం ఇప్పుడు దీనస్థితిలో ఉంది. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలకు ఎలాంటి గుర్తింపు దక్కటం లేదు. ప్రభుత్వాలు, పరిశ్రమే కాదు.. ఆయన సినిమాలు చూసి ఆనందించిన తెలుగు ప్రేక్షకులు కూడా పట్టించుకోవటం లేదు. జగమంత కుటుంబం నాది అనుకున్న కాంతారావు కుటుంబానికి జనం అండగా నిలబడటం లేదు. సినిమా చూసినట్లు వారి కష్టాలు చూస్తూ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నది నిర్వివాదాంశం.