శోభా శెట్టి అలియాస్ మోనిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తెలుగు బుల్లి తెర మీద మొదటి స్థానంలో నిలిచిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క ఎంతగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారో.. డాక్టర్ బాబు వెంటపడి.. దీపకు చుక్కలు చూపించిన మోనిత కూడా అదే రేంజ్‌లో పేరు సంపాదించుకుంది. ఏళ్లుగా ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం సీరియల్.. సోమవారంతో ముగిసిపోయింది. సీరియల్ అయిపోయినప్పటికి.. ప్రేక్షకులు మాత్రం.. ఇప్పట్లో ఈ సీరియల్‌లోని పాత్రలను అంత సులుభంగా మరచిపోలేరు. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబును ప్రేమ పేరుతో వేధించే మోనిత పాత్రలో మెప్పించింది శోభా శెట్టి.
శోభా శెట్టి.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో చానెల్ క్రియేట్ చేసిన మోనిత.. సీరియల్స్, షూటింగ్స్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మోనిత అలియాస్ శోభా శెట్టి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాను.. అంటూ పెళ్లి చూపులకు రెడీ అవుతున్న వీడియోని తన యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
సోమవారం (జనవరి 23) నాడు శోభా శెట్టి పెళ్లి చూపులు జరిగాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే రోజు ఆమె బర్త్ డే కూడా. పుట్టినరోజునే పెళ్లి చూపులు జరిగాయి. ఈ విషయాన్ని తన యూట్యూబ్ చానెల్ ద్వారా తెలిపింది శోభా శెట్టి. ‘‘పెళ్లి చూపులు అనే పదం చెప్పటానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది. అయితే నాకు తెలియకుండానే ఈ రోజు మా అమ్మ నా పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. సిగ్గు పడుతున్నానంటే నాకు పెళ్లి కళ వచ్చేసినట్టే. పెళ్లి చూపుల్లో నన్ను చూడటానికి రాబోతున్న అబ్బాయి ఎవరో నాకు కూడా తెలియదు’’ అన్నది.
‘‘ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు నా బర్త్ డే. ప్రతి సంవత్సరం ఇదే రోజున మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటాం. నా బర్త్ డే రోజునే పెళ్లి చూపులు జరుగుతున్నాయి. కాబట్టి నేను సంప్రదాయ బద్దంగా రెడీ అవుతున్నాను. నన్ను రెడీ చేయటానికి మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ వచ్చేశారు. చీర, నగలు అన్ని కూడా చక్కగా అదిరిపోయాయి. అంతా హడావుడిగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.
ఇక పెళ్లి చూపులు, బర్త్‌డే సందర్భంగా శోభా శెట్టి.. ఆరెంజ్, గోల్డ్ కలర్ కాంబినేషన్‌లోని పట్టు చీర కట్టుకుని పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది. చీరకు మ్యాచ్ అయ్యే నగలతో.. అందంగా రెడీ అయ్యి నిజంగానే బుట్టబొమ్మలా కనిపించింది శోభా శెట్టి. ‘‘నన్ను చాలా గెటప్స్‌లో చూసుంటారు. అయితే ఫస్ట్ టైమ్ ఇలా పట్టుచీరలో కనిపిస్తున్నాను. అది కూడా నగలతో’’ అంటూ తెగ సిగ్గు పడింది శోభా శెట్టి. ఆ తర్వాత తాను పెళ్లి చూపులకు ఎలా రెడీ అయ్యిందో వీడియోలో చూపించింది.
ఇక పెళ్లి చూపుల కోసం వచ్చే వారికి భోజనాలను కూడా సిద్ధం చేశారు. శోభా శెట్టి కూడా.. పెళ్లి కొడుకు ఎవరో తనకు తెలియదని చెప్పింది. కనుక అతను ఎవరో తెలుసుకోవాలని నెటిజనులు, ఆమె ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇది ప్రమోషన్ వీడియో కాదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.