సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో జగపతి బాబు ఒకరు. నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జగపతి బాబు కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ బాటలో సాగినప్పటికీ తర్వాత వరుస అపజయాలతో సతమతమయ్యారు.
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా శోభన్ బాబు కి ఎంతో పేరు మంచి పేరు ఉండేది.. ఆ తర్వాత నటుడు జగపతి బాబు కి మాత్రమే ఆ పేరు దక్కిందని చెప్పొచ్చు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు 1989లో ‘సింహస్వప్నం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదటి చిత్రమే ద్విపాత్రాభినయంలో నటించాడు. ఆ సినిమా అనుకున్నంతగా విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత జగన్నాటకం, పెద్దరికం లాంటి చిత్రాలు జగపతిబాబు కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇండస్ట్రీలో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన జగపతిబాబు జీవితం పూలబాట ఏమీ కాదు.. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు అనుభవించారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు..కానీ అది అంతగా సెట్ కాలేదు. దాంతో కుటుంబ కథా చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇవి కూడా ఆయనకు పెద్దగా సక్సెస్ తెచ్చిపేట్టలేదు.. కానీ ఫ్యామిలీ హీరోగా అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు. కొంత కాలం జగపతి బాబు నటించిన చిత్రాలకు మంచి ఆదరణ లభించినా.. 2010 నుంచి ఆయనకు వరుస అపజయాలతో సతమతమయ్యాడు. దీనికి తోడు ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముట్టాయి. దాంతో ఆర్థిక కష్టాలు పోగొట్టుకోవడానికి ఏ చిన్న ఆఫర్ వచ్చినా కాదనకుండా చేశారు.
2014 లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ చిత్రం జగపతి బాబు జాతకాన్నే మార్చివేసింది. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించాడు. బాలకృష్ణ, జగపతి బాబు ఢీ అంటే ఢీ అనేట్టుగా నటించారు. అప్పటి నుంచి వరుసగా విలన్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం జగపతి బాబు తెలుగు, తమిళ, మళియాళ, హిందీ, కన్నడ భాషల్లో బిజీ నటుడిగా మారిపోయారు. మొత్తానికి జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. ‘నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. నాకు సినిమానే లోకం.. సినిమా తప్ప ఏదీ తెలియదు. ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతుంది.. ఎన్నో కష్టనష్టాలు చూశాను. నేను ఎంతో డబ్బు సంపాదించాను.. కానీ నిలుపుకోలేకపోయాను. చాలా మంది నేను గుర్రపు పందాలు, జూదం ఆడి ఆస్తి పోగొట్టుకున్నానని అనుకుంటారు.. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. కాసినో ఆడుతాను.. కేవలం అది సరదాకు మాత్రమే. నాకు మొదటి నుంచి డబ్బులు దాచడం తెలియదు.. నేను నమ్మినవాళ్లు నన్ను దారుణంగా మోసం చేశారు. చాలా మందిని గుడ్డిగా నమ్మి నా ఆస్తులు పోగొట్టుకున్నాను.. దీనికి నాదే పూర్తి బాధ్యత.
నేను ఆస్తులు పొగొట్టుకున్నాను.. నా పరిస్థితి బాగాలేదని చాలా మంది దుష్ప్రచారం చేశారు. కొంతకాలంగా ఆ పుకార్లు నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. సురేష్ కృష్ణ దర్శకత్వంలో ‘సాహసం’ అనే మూవీలో నటించాను. ఆ మూవీ సెట్స్ లో నాకు జరిగిన అవమానం జీవితంలో మర్చిపోలేను. వారం రోజుల పాటు నాకు అన్నం పెట్టలేదు సరికదా.. కనీసం ఎవరు కూడా తింటావా అని అడగలేదు. వీడు ఎక్కడికీ పోలేడు.. ఇక్కడే ఉంటాడు లే అన్న చులకనభావంతో చూశారు. ఇతర భాషల్లో నటించే వారు వస్తే వారికి ఎక్కడలేని గౌరవం ఇచ్చేవారు. ఆ అనుభవం నా జీవితంలో గొప్ప గుణపాఠం నేర్పింది. ఈ మూవీలో మరో నటుడిగా భానుచందర్ నటించారు. ప్రస్తుతం నా కెరీర్ బాగా సాగుతుంది.. డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నాను అన్నారు.
ఇక నా కుటుంబం విషయానికి వస్తే నాకు ఇద్దరు కూతుళ్లు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచాను. పెద్దమ్మాయి ఓ అమెరికన్ ని పెళ్లి చేసుకుంది. ఇక చిన్నమ్మాయికి పెళ్లి వద్దని చెప్పాను. నీకు అన్ని విధాలుగా సెట్ అయ్యేవాడు.. నిన్ను బాగా చూసుకునే భాగస్వామిని నువ్వే వెతికి చేసుకో అన్నాను. నాకు తెలిసి పెళ్లీ, పిల్లలు అంటూ బాధ్యతలు తీర్చుకోవడానికి వారి వెంట పడటం కరెక్ట్ కాదు.. అందుకే నా పిల్ల విషయంలో స్వేచ్చను ఇచ్చాను అన్నారు. ప్రస్తుతం తెలుగు లోనే కాదు.. ఇతర భాషల్లో నటించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’ అని అన్నారు జగపతి బాబు.