ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేయటం సర్వ సాధారణం అయిపోయింది. దీన్నే సినిమా భాషలో మల్టీస్టారర్ అంటున్నారు. తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి.. వస్తున్నాయి. మార్చి నెలలో వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంనే ప్రముఖ శాండల్ వుడ్ స్టార్ యశ్‌తో రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ప్రముఖ శాండల్ వుడ్ డైరెక్టర్, మఫ్తీ ఫేమ్ నాథాన్ దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరిగింది.
ఈ మేరకు దర్శకుడు నాథాన్.. రామ్ చరణ్‌కు కథ వినిపించారని, ఆ కథను విన్న తర్వాత చరణ్ దాన్ని హోల్ట్‌లో పెట్టారన్న టాక్ వినిపించింది. తాజాగా, రామ్ చరణ్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు శాండల్‌వుడ్ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. మరి, ఈ వార్తే గనుక నిజం అయితే రామ్ చరణ్, యశ్ ఫ్యాన్స్‌కు ఓ పండగనే చెప్పొచ్చు. అంతేకాదు.. ఇద్దరూ నేషనల్ లెవెల్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు కావటంతో సగటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మల్టీస్టారర్ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశ వ్యాప్తంగా 1111 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది.
అక్టోబర్ 21 జపాన్‌లో కూడా విడుదలైంది. ఇక, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 1200కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ మార్కును సాధించిన మొదటి కన్నడ సినిమాగా చరిత్ర సృష్టించింది. కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినిమాలకు దేశ వ్యాప్తంగా ఓ మార్కెట్ ఏర్పడింది. తాజాగా, వచ్చిన కన్నడ సినిమా ‘కాంతారా’ తెలుగు నాట కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతోంది.