సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పేర్లు వినగానే ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చేస్తాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోకి మాస్ డైరెక్టర్ తో సినిమా కుదిరిందంటే.. ఆ మాస్ జాతర ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరూ ఎక్సపెక్ట్ చేయని కాంబినేషన్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ కాంబినేషన్ లో నిజంగా ఓ మాస్ సినిమా పడితే మామూలుగా ఉండదనే అంచనాలకు ప్రేక్షకులు వచ్చేశారు. మరి అంత పవర్ ఫుల్ కాంబినేషన్ ఏమయ్యుంటుంది? అనంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరి కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా అనౌన్స్ మెంట్ కాబోతుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్ కి రెడీ అవుతుండగా.. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ K’ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అదీగాక ఇటీవలే డైరెక్టర్ మారుతీతో మరో సినిమా.. షూటింగ్ మొదలైంది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు ప్రభాస్. అయితే.. ప్రభాస్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో కూడా కొత్త సినిమాలు లైనప్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నాడని.. ఆ విధంగా తాజాగా దర్శకుడు బోయపాటితో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్.
మరోవైపు మాస్ డైరెక్టర్ బోయపాటి.. గతేడాది నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు యంగ్ హీరో రామ్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఆ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే.. రామ్ తో సినిమా చేశాక.. బోయపాటి ప్రభాస్ కోసం ఓ మాస్ సబ్జెక్టు రెడీ చేసే ప్లాన్ లో ఉన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. వీరి కాంబినేషన్ మూవీని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారని వినికిడి. రామ్ తో సినిమా తర్వాత బోయపాటి మరోసారి బాలయ్యతో చేస్తాడని అంటున్నారు. కానీ.. ఇంతలోనే ప్రభాస్ తో మాస్ సినిమా అనేసరికి డార్లింగ్ ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ పీక్స్ లోకి చేరుకుంది. చూడాలి మరి త్వరలో ప్రభాస్ – బోయపాటిల కాంబినేషన్ పై గుడ్ న్యూస్ వినిపిస్తుందేమో!