ఆమె సరిగమల పూదోటలో విరిసిన కుసుమం. ఆమె స్వరంలో సరాగాలు సయ్యాటలాడుతాయి. ఆమె పల్లవి ఎత్తుకుంటే కూలీల ఆరుగాలం కష్టం.. ఆవిరై పోతుంది. అయితే ప్రతిభ ఉన్నా పరాభవాలు తప్పలేదు. ఓ పక్క ఆమె గొంతును కొనియాడుతూనే రూపాన్ని వెక్కిరించేవారు. ‘రూపం కాకిలా.. గొంతు కోకిలలా’ అంటూ హేళన చేశారు. అయితేనేం.. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం అలుపెరగని పోరాటం చేసింది. ఆమె రూపాన్ని చూసి నవ్విన వారే ఇప్పుడు జేజేలు కొడుతున్నారు. ఏదైనా సాధించాలంటే అందం కాదు.. అకుంటిత దీక్షే ముఖ్యం అని రుజువు చేసింది. వెక్కిరించిన ఊరికి తన పాటతో బస్సు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిన దాసరి పార్వతి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకోసం.
దాసరి పార్వతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరు ఈ పార్వతి అంటూ వెతుకులాట మొదలు పెట్టారు. ఆమెకు ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే.. తాజాగా ప్రారంభం కానున్న ‘సరిగమప’ కార్యక్రమం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న యువతే ఈ దాసరి పార్వతి. ఆమె పాటతో న్యాయ నిర్ణేతలు, టాప్ సింగర్స్, ప్రేక్షకులు అందరినీ కట్టిపడేసింది. ఆమె గురించి అంత గొప్పగా మాట్లాడటానికి ఆమె పాట ఒక్కటే కారణం కాదు.. ఆమె నేపథ్యం కూడా. మారుమూల పల్లెటూరు నుంచి ఇక్కడి వరకూ వచ్చింది. ఆమెది కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామం. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతన్న కుటుంబం వాళ్లది. ఆమెకు ఇద్దరు అన్నలు ఉన్నారు.
తను నిర్దేశించుకున్న లక్ష్యం కోసం చదువును కూడా పక్కన పెట్టేసింది. ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత తన పూర్తి దృష్టి సంగీత సాధన మీదే పెట్టింది. ఆ ఊరికి బస్సు సౌకర్యం లేకపోయినా.. కిలో మీటర్లు నడిచి సంగీతం నేర్చుకుంది. ఎప్పటికైనా ఒక గొప్ప సింగర్ కావాలి, తనకొచ్చిన పేరు ప్రఖ్యాతలు తన ఊరికి ఉపయోగపడాలి అనేది ఆమె తాపత్రయం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలాగే దాసరి పార్వతి తన మొదటి అడుగుతోనే తమ ఊరి వాళ్ల కలను నెరవేర్చింది. ఎంతకాలంగానో గ్రామస్థులు ఎదురు చూసినా రాని బస్సు.. పార్వతి పాటతో వచ్చింది.
ఆమె పాటకు మంత్రముగ్దులైన జడ్జిలు ‘నీకు ఏం కావాలో కోరుకో’ అని అడగగానే.. ‘నాకు ఏం వద్దు సార్ మా ఊరికి బస్సు వస్తే చాలు’ అనేసింది. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె గ్రామానికి బస్సు వచ్చింది. సంగీతం నేర్చుకునేందుకు కిలోమీటర్లు నడుస్తూ వెళ్లిన పార్వతి కష్టం.. ఆ ఊరిలో ఇంకెవరినీ నడవకుండా చేసింది. హేళన చేసిన ఆ ఊరివారే ఇప్పుడు పార్వతికి జేజేలు కొడుతున్నారు. ఒక కంటెస్టెంట్ గానే తమ ఊరికి బస్సు తేగలిగిందంటే.. పార్వతి సింగర్ అయితే తమ ఊరి రాతను మార్చేస్తుందని ఆ గ్రామస్థులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి దాసరి పార్వతికి మీరు కూడా కామెంట్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి.