హీరోయిన్ గా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించింది. కొన్నాళ్ళు సినిమాలు చేసింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్త, పిల్లల కోసం సినిమాలు మానేసింది. అయితే ఆమె భర్త అకాల మరణం చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరి బిడ్డలను పెంచడం ఒక సవాలుగా మారింది. ఎంతో శ్రమించి తన ఇద్దరి బిడ్డలను పెంచి పోషించింది.
సినిమాల్లో నటించే హీరోయిన్ల జీవితాల్లో కూడా అందరి జీవితాల్లో ఉన్నట్లే చీకట్లు ఉంటాయి. ఎందుకంటే మేకప్ తీసేస్తే వారు కూడా మనుషులే. చేతి నిండా సినిమాలు, స్టార్ స్టేటస్ అన్నీ ఉండి ఉన్నట్టుండి అవన్నీ పోతే వారి జీవితం చాలా దారుణంగా ఉంటుంది. తోడుగా ఉండాల్సిన భర్త చనిపోతే ఆ జీవితం వర్ణించలేనిది. పిల్లల్ని పెంచడం మాత్రమే కాదు, వాళ్ళకొక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న బరువువైన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ తన భుజాన వేసుకుని ఒక హీరోయిన్ తన కొడుకులను పెంచి పెద్ద చేసింది. భర్త చనిపోయాక కష్టాలను తాను అనుభవించి.. పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చింది. ఆమె మరెవరో కాదు భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ.
హీరోయిన్ శాంతి ప్రియ అంటే తెలుగు ప్రజలకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఈమె హీరోయిన్ గా కంటే ఫేమస్ నటి భానుప్రియ చెల్లెలుగానే అందరికి సుపరిచితం. 1988లో వచ్చిన “మహర్షి” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శాంతి ప్రియ.. తొలి సినిమాతోనే కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో మహర్షి సినిమా ఒక అద్భుతం. అలాంటి అద్భుతమైన చిత్రంలో ఈమె పాత్ర ఇప్పటికీ అందరి హృదయాల్లో నిలిచిపోతుంది. ఆ తర్వాత ఆమె తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లో అడపాదడపాగా నటించింది. అయితే.. తన భర్త సిద్ధార్థ్ రే అకాల మరణంతో శాంతి ప్రియ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ నుండి ఆమె ఒంటరి మహిళగా లైఫ్ ను లీడ్ చేస్తూ.. తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించింది. అయితే.. ఈ సీనియర్ హీరోయిన్ ఇన్నాళ్లలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఒక అవార్డు ఫంక్షన్ లో శాంతి ప్రియ, హిందీ నటుడు సిద్ధార్థ్ రే కలుసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు 1992లో వివాహం చేసుకున్నారు. హిందీలో వచ్చిన “బాజిగర్” సినిమాతో సిద్ధార్థ్ చాలా పాపులర్ అయ్యాడు. ఇక వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో 2004లో సిద్ధార్థ్ రే అకాల మరణం ఆమెను కృంగదీసింది. అప్పటి నుంచి ఆమె తన జీవితాన్ని ఒంటరిగానే కొనసాగించింది. శాంతి ప్రియకు ఇద్దరు కొడుకులు. భర్త మరణాంతరం మరొక వివాహం చేసుకోకుండా ముంబైలోనే ఒంటరిగా ఉంటూ తన ఇద్దరు పిల్లలను పెంచారు.
ఈ క్రమంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. “నా భర్త చనిపోయాక నేను చాలా ఆందోళన చెందా. నా ఇద్దరు పిల్లలను ఎలా పెంచాలి అని కంగారు పడ్డాను. కానీ.. ఈ విషయంలో నాకు మా అమ్మే స్ఫూర్తి. మా నాన్న చనిపోయినప్పుడు కూడా మా అమ్మ చెన్నైకి ఒంటరిగా వచ్చి.. అక్కను, అన్నను, నన్ను కష్టపడి పెంచింది. మా అమ్మ మమ్మల్ని ఒంటరిగా పెంచగా లేనిది నేను నా ఇద్దరు పిల్లల్ని ఎందుకు పెంచలేను అని అనిపించింది. అందుకే ముంబైలోనే ఒంటరిగా ఉంటూ నా జీవిత ప్రయాణాన్ని కొనసాగించాను” అని వివరించింది. చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న శాంతి ప్రియ ప్రస్తుతం “ధారావి బ్యాంకు” వెబ్ సిరీస్ చేస్తుంది.