ఆడవాళ్ళకి మాతృత్వం అనేది ఒక వరం. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీతో వచ్చిన బరువుని శాపంగా భావిస్తారు. శరీర బరువుని తగ్గించుకోవడం కోసం ఇష్టమైన వాటిని తినకుండా ఉంటారు. డైట్ పాటిస్తుంటారు. అయితే డైట్ పాటించకుండా, ఇష్టమైనవన్నీ తింటూ కూడా ప్రెగ్నెన్సీతో వచ్చే బరువుని తగ్గించుకోవచ్చునని హీరోయిన్ అనిత హస్సానందని ఒక వీడియో షేర్ చేసింది. నువ్వు నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిత.. శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో నటించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించిన అనిత.. పలు బాలీవుడ్ టీవీ షోస్, సీరియల్స్ లో నటించింది. వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఆరవ్ అనే బాబు కూడా ఉన్నాడు. ఫిబ్రవరి 9 2021లో అనిత.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె బొద్దుగా తయారైంది. ప్రసూతి సమయంలో సాధారణంగా మహిళలు బొద్దుగా మారతారు. అందరిలానే అనిత కూడా బొద్దుగా అయిపోయింది. అయితే అప్పటి నుంచి ఆమె గంటలు గంటలు వర్కవుట్లు చేస్తూ వచ్చింది. మెల్లమెల్లగా శరీర బరువును తగ్గించుకుంటూ ఫిట్ గా తయారైంది. ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ని ఒక వీడియోలో చూపిస్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
ఏడాది క్రితం బొద్దుగా.. ఇప్పుడు స్లిమ్ గా కనబడుతున్న హెవీ వెయిట్ టూ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోని పోస్ట్ చేసింది. అయితే తాను ఇలా అయినందుకు డైట్ ఫాలో అవ్వలేదని, ఇష్టం వచ్చిన ఫుడ్ తిన్నానని రాసుకొచ్చింది. అయితే వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గినట్లు అనిత వెల్లడించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు అనితను అభినందిస్తున్నారు. ఎంతోమంది మాతృమూర్తిలకు నువ్వొక ఆదర్శం అంటూ ప్రశంసిస్తున్నారు. అనితలా ప్రసూతి తర్వాత శరీర బరువుని తగ్గించుకోవాలనుకునే ప్రతీ మహిళకు ఈ వీడియో ఒక ప్రేరణ కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.