ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ వివాదం చుట్టు ముట్టింది. కబాలి నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడించిన అంశాలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నిఖిల్. తర్వాత కార్తికేయ, స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య లాంటి చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించాడు. కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటాడు హీరో నిఖిల్. ప్రస్తుతం టాలీవుడ్ ని మరోసారి డ్రగ్స్ వివాదం చుట్టుముట్టింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరో నిఖిల్ డ్రగ్స్ పై సంచలన కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
గతంలో డ్రగ్స్ వివాదం తెలుగు ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసింది. తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడించిన అంశాలతో టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం మరోసారి కలకలం రేగింది. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై యంగ్ హీరో నిఖిల్ సంచలన కామెంట్స్ చేశారు. శనివారం హైదరాబాద్ లోని రాష్ట్ర మాతక ద్రవ్యాల నిరోదక శాఖ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ అనే ఓ కార్యక్రమంలో మరో నటుడు ప్రియదర్శితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నన్ను కొంతమంది డ్రగ్స్ తీసుకోమని ఆఫర్ ఇచ్చారు. ఒక్కసారి దానికి అలవాటు అయితే జీవితం సర్వనాశనం అవుతుందని భావించాను.. అందుకే వాటికి ఎప్పుడూ దూరంగా ఉంటూ వచ్చానని అన్నారు.
దేవుడు ఇచ్చని జీవితం ఎంతో గొప్పది.. దాన్ని మంచి పనులకు వినియోగించాలని హితవు పలికారు. విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉంది.. సరదాగా పార్టీలకు వెళ్లి డ్రగ్స్ మాత్రం తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రయాణాలు చేయండి, సైక్లింగ్ చేయండి, విహారయాత్రలకు వెళ్లండి, ఫుట్ బాల్, క్రికెట్ వంటి ఆటలు ఆడండి, సినిమాలు చూడండి… అంతేతప్ప మత్తుకు బానిసలు కావొద్దు అని సలహా ఇచ్చారు. అతి త్వరలో మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. గతంలో తానకు సిగరెట్ అలవాటు ఉందని.. సిగరెట్‌కు బానిస కావొద్దని సంకల్పించిన వెంటనే మానేశానని అన్నారు. డ్రగ్స్ వల్ల ఎన్నో అనార్థాలు ఉన్నాయి.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని హితవు పలికారు.