కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర మీద యాంకర్ గా అడుగుపెట్టి.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి.. హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. డేంజర్ సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాల్లో తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుంది కాబట్టి అల్లరి చేయడం లేదు గానీ అప్పట్లో యాంకర్ గా ఉన్నప్పుడు కలర్స్ స్వాతిగా అమ్మడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమందిని అలరించింది. కలర్స్ స్వాతి అంటే అప్పట్లో చాలా మందికి క్రష్ ఉండేది. అంతలా ఆమె అందరి మనసు గెలుచుకుంది.
అయితే అప్పట్లో కలర్స్ స్వాతి మీద క్రష్ ఉన్న వారిలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఉన్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం పంచతంత్రం అనే సినిమాలో నటిస్తోంది. స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద, రాహుల్ విజయ్, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు నటిస్తున్న పంచతంత్రం మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య అతిథిగా దర్శకుడు హరీష్ శంకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన హీరోయిన్ స్వాతి గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్వాతి నా ఆల్ టైమ్ క్రష్ అని, కలర్స్ ప్రోగ్రామ్ నుంచి తనను చూస్తున్నానని, అప్పటి నుంచి తనపై క్రష్ ఉందని అన్నారు. స్వాతిని రిక్వస్ట్ చేస్తే.. మిరపకాయ సినిమాలో గెస్ట్ రోల్ చేసిందని.. స్వాతి టాలీవుడ్ లో ఉండడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం, స్వాతి చేసుకున్న దురదృష్టం అని అన్నారు. స్వాతి సాధించిన విజయాల కంటే ఇంకా ఇంకా ఎక్కువ విజయాలు సాధించే అర్హత స్వాతికి ఉందని అన్నారు. బెట్టు చేస్తుంది గానీ చాలా మంచి నటి అని అన్నారు.