స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. ఆయా హీరోల లేటెస్ట్ మూవీల నుంచి ఏదోఒక అప్‌డేట్ రావడం పక్కా. అభిమానులు ఆప్యాయంగా రౌడీ అని పిలుచుకునే హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ఆయన తాజా సినిమా ‘లైగర్’ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. దేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీజర్ విడుదల వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరూ బయటకు రాకుండా వారితో పాటు వారిని అభిమానించే వారిని జాగ్రత్తగా చూసుకోవాలని చిత్ర యూనిట్ కోరింది.
టీజర్ విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేశామని చెప్పిన నిర్మాతలు తప్పకుండా టీజర్ అభిమానులను మెప్పిస్తుందని, విజయ్ దేవరకొండను ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో చూస్తారని తెలిపారు. పూరీ జగన్నాథ్ దర్శకుడు. కరణ్ జోహార్, పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది.