రూ. 1.84 కోట్ల వివాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ సంఘటన చెన్నై ఫిల్మ్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. పలువురు సంగీత దర్శకులు జీవీకి తమ మద్దతు తెలుపుతున్నారు.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన సినీ తారలు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో జీవి ప్రకాశ్ ఒకరు. మేనమామ ఏఆర్ రెహమాన్ స్పూర్తితో సంగీత దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు జీవీ. పలు హిట్టు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న టైంలోనే నటుడిగా తెరంగేట్రం చేశారు. నటుడిగా కూడా భేష్ అనిపించుకుంటున్నారు. ఓ వైపు సంగీత దర్వకత్వం చేస్తూనే మరో వైపు నటుడిగా సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉండాల్సిన ఆయన గత కొద్దిరోజుల నుంచి కోర్టు, కేసు అంటూ తిరుగుతున్నారు. ఇన్‌కమ్ టాక్స్ లావాదేవీల విషయంపై సతమతమవుతున్నారు.
ఇంతకీ సంగతేంటంటే.. కొద్దిరోజుల క్రితం జీఎస్టీ జాయింట్ కమిషనర్ జీవీ ప్రకాశ్‌కు ఓ నోటీసు ఇచ్చారు. జీవి ప్రకాశ్ సమకూర్చిన సంగీతంపై 1.84 కోట్ల సర్వీస్ టాక్స్ కట్టాలని ఆ నోటీసులు ఉంది. నాలుగు వారాల్లోపు నోటీసులపై స్పందించాలని కూడా ఉంది. దీంతో జీవీ ప్రకాశ్ షాక్‌కు గురయ్యారు. ఒక్కసారిగా అన్ని కోట్లు ఎలా కట్టాలని వాపోయారు. దీనిపై చెన్నై హై కోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో జీవి ప్రకాశ్ ఏమన్నాడంటే..‘‘ నేను సమకూర్చిన సంగీతం కాపీరైట్స్ నా దగ్గర లేవు. నేను వాటిని సినిమా నిర్మాతలకు శాశ్వతంగా ఇచ్చేశాను. నేను వారినే నిజమైన యజమానులుగా చేశాను. అలాంటిది.. వాటిపై నా నుంచి టాక్స్ తీసుకోవాలనుకోవటం చట్టవిరుద్దం’’ అని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇన్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీచేసింది. జీవి ప్రకాశ్ అప్పీల్‌పై స్పందించాలని పేర్కొంది. ప్రస్తుతం జీవీ ప్రకాశ్ ఉదంతం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పలువురు సినీ దర్శకులు జీవీకి మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టు గనుక జీఎస్టీ కమిషనర్ అధికారాలతో ఏకీభవిస్తే.. జీవీ ప్రకాశ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీలోని మిగిలిన సంగీత దర్శకులు కూడా తాము సమకూర్చిన సంగీతంపై సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇది నిజంగా వారికి చేదు వార్త అని చెప్పొచ్చు. అలా కాకుండా కోర్టు జీవీ ప్రకాశ్‌తో ఏకీభవిస్తే మంచి పరిణామమే. మరి, తన సంగీతంపై సర్వీస్ టాక్స్ కట్టలేనంటూ జీవీ కోర్టును ఆశ్రయించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.