తమ కిష్టమైన హీరో కోసం ఫ్యాన్స్ ఎన్ని కష్టాలు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ హీరోను ఏ చిన్నమాట అన్నా వాళ్లు తట్టుకోరు. గొడవపడ్డానికి కూడా వెనకాడరు. హీరో పిలుపిస్తే.. సేవా కార్యక్రమాలు చేయటానికైనా సిద్ధం అయిపోతుంటారు.
పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నడ నాట ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఆయన్ని తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. ఆయన చనిపోయి మూడు సంవత్సరాలు అవుతున్నా.. ఫ్యాన్స్ గుండెల్లో మాత్రం ఆయనకున్న క్రేజ్ అభిమానం ఏ మాత్రం తగ్గటం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మరింత పెరిగిందనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆయన బతికున్నపుడు చేసిన సేవా కార్యక్రమాలను ఫ్యాన్స్ కొనసాగిస్తూ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఆయనకోసం ఏకంగా చిన్నచిన్న గుళ్లు కూడా కట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అడుగు ముందుకు వేశారు హోసపేటకు చెందిన ఫ్యాన్స్. హోసపేటలో పునీత్ రాజ్‌కుమార్ గుడి ఉన్న సంగతి తెలిసిందే.
అక్కడినుంచే పునీత్ రాజ్‌కుమార్ మాల వేసుకోవాలని అభిమానులు నిశ్చయించుకున్నారు. హోసపేట పునీత్ ఫ్యాన్స్ సంఘం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఈ విధంగా ఉంది. మార్చి 1 నుంచి పునీత్ మాల కార్యక్రమం మొదలవుతుంది. మార్చి 17న మాల ముగింపు కార్యక్రమం ఉంటుంది. మార్చి 18న పునీత్ రాజ్‌కుమార్ సమాధిని సందర్శించి మాల విరమించవచ్చు. ఈ మాల వేసుకునే వారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. కాశాయ వస్త్రాలు ధరించాలి. పునీత్ డాలర్ ఉన్న మాలను మెడలో వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి.
చెడ్డ పనులు చేయకూడదు. పునీత్ ఫొటో పెట్టుకుని పూజలు చేయాలి. ఈ మాలను 11 రోజులు, 5 రోజులు, ఒక రోజు వేసుకోవచ్చు. మాల విరమణ సమయంలో ఇరుముడి వేసుకుని పునీత్ సమాధి దగ్గరకు వెళ్లాలి. అక్కడ మాలను విరమించాలి. హంపిలోని పుణ్య నదిలో స్నానం చేసి, విరూపాక్షుడి దర్శనం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కరపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పునీత్‌పై ఫ్యాన్స్‌కు ఉన్న అభిమానానికి జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరణించినా కూడా గుర్తుండిపోయే వ్యక్తి పునీత్ అంటూ దివంగత హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, అభిమానులు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పేరిట మాల వేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.