ప్రముఖ దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్పు పుట్టిన రోజుల వేడుకల్ని ప్రత్యేకంగా జరపాలని భావిస్తోంది. ఇక, ఫ్యాన్స్ నిన్నటినుంచే అప్పు సమాధి దగ్గర బారులు తీరారు. ఆయన సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఫ్యాన్ అప్పు సమాధి దగ్గర రచ్చ చేశాడు. కుటుంబంతో సెల్ఫీలు దిగుతూ పోలీసులనే ఇబ్బంది పెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గురువారం ఓ ఫ్యాన్ అప్పు సమాధిని దర్శించుకోవటానికి ఫ్యామిలీతో వచ్చాడు. మిగిలిన ఫ్యాన్స్‌తో పాటే క్యూ లైన్లో నిలబడ్డాడు.
సమాధి దగ్గరకు రాగానే సెల్ఫీలు తీసుకోవటం మొదలుపెట్టాడు. మొత్తం ఫ్యామిలీ సెల్ఫీలలో బిజీ అయిపోయింది. దీంతో క్యూలైన్ ముందుకు సాగటం ఆగిపోయింది. అక్కడే ఉన్న ఓ పోలీస్ సదరు అభిమాని చేష్టలకు మండిపడ్డాడు. తొందరగా అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. అయినా ఆ అభిమాని మాట వినలేదు. నిదానంగా తన ఫ్యామిలోని వారితో సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నాడు. ‘‘మేము ఎప్పుడు పడితే అప్పుడు రాము. వచ్చేదే సంవత్సరానికి ఒక్కసారి. మీరట్లా తొందరపెడితే ఎలాగా’’ అని పోలీస్‌నే తిరిగి ప్రశ్నించాడు. దీంతో పోలీస్‌కు మరింత కోపం వచ్చింది.
‘‘నీ వెనకాల నిలబడ్డది మనుషులు కాదా? పక్కకు పో’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29, 2021న కార్డియాక్ అరెస్ట్‌తో మృత్యువాతపడ్డారు. అప్పటికి ఆయన వయసు కేవలం 46 ఏళ్లు మాత్రమే. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన మొదటి సినిమాలోని పేరునే తన పేరుగా మార్చుకున్నారు. అప్పుగానే ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్రగా మిగిలిపోయారు.