పూల మొక్కల మధ్య కూర్చుని.. నవ్వుతూ ఫోటో తీయించుకున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడామె ఒక స్టార్ హీరోయిన్. షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి.. ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదృష్టం కొద్దీ మొదటి సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలో ఈమె కాజల్ కి చెల్లెలుగా నటించింది. సపోర్టింగ్ రోల్ చేసిన తర్వాత శ్రీవిష్ణుతో కలిసి ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో హీరోయిన్ గా జతకట్టింది. ఆ తర్వాత మళ్ళీ నా రాకుమారుడు, ఎవడే సుబ్రమణ్యం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. ఆ తర్వాత చేసిన సినిమా ఉందండి.. సంచలనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
సోలో హీరోయిన్ గా విజయ్ దేవరకొండతో నటించి సాలిడ్ హిట్ కొట్టేసింది. ఆమె ఎవరో కాదు రీతూ వర్మ. పెళ్లి చూపులు సినిమాతో కుర్రాళ్ళని చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. పెళ్లి చూపులు తర్వాత నిఖిల్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ కేశవలో హీరోయిన్ గా నటించింది. టక్ జగదీశ్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించింది. ధనుష్ నటించి వీఐపీ 2 సినిమాలో అతిధి పాత్రలో నటించిన రీతూ వర్మ.. పుథం పుదు కాలై, నీతం ఒరు వానం వంటి సినిమాల్లో నటించింది. తమిళ సూపర్ స్టార్ విక్రమ్ సరసన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది.
విలక్షణ హీరో విక్రమ్ హీరోగా గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ నచ్చతిరం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈమె నార్త్ ఇండియన్ కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్ లోనే పెరిగింది. ఆమె తండ్రి మధ్యప్రదేశ్ వాసి. ఈమె ఇంట్లో హిందీ మాట్లాడుతుంది. సినిమాల్లో తెలుగు చక్కగా మాట్లాడుతుంది. తన సినిమాలకి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. హైదరాబాద్ లోని విల్లా మేరీ ఉమెన్స్ కాలేజ్ లో ఇంటర్ చదివిన రీతూ వర్మ.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో డిగ్రీ చేసింది. చదువైపోయాక మిస్ హైదరాబాద్ బ్యూటీ పీగెంట్ అందాల పోటీలో పాల్గొని.. మొదటి రన్నర్ అప్ గా నిలిచింది. అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ లో తన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిలో పడింది.
2012లో 48 హవర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ లో ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికైంది ఈ షార్ట్ ఫిల్మ్. అంతేకాదు ఉత్తమ నటిగా రీతూ వర్మ అవార్డు దక్కించుకుంది. 2013లో ఈ షార్ట్ ఫిల్మ్ ని కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ లో ప్రదర్శన చేశారు. అలా అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. బాద్ షా సహా పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి.. ఇప్పుడు హీరోయిన్ గా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో సినిమా యాట్టర్ల త్రోబ్యాక్ ఫోటోలు, చైల్డ్ హుడ్ ఫోటోలు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో పురావస్తు తవ్వకాల్లో రీతూ వర్మ ఫోటో కూడా బయటపడింది. ఏ మాటకామాట చెప్పుకోవాలి, రీతూ వర్మ ఇప్పుడు నవ్వితే ఎలా ఉంటుందో.. చిన్నప్పుడు కూడా అలానే ఉంది.