గత కొంత కాలంగా టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. తానినేని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలన హిట్ నిటిచిన యమగోల చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో ఆయనకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు వచ్చింది.
1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో తాతినేని రామారావు జన్మించారు. ఆయన టీ. రామారావు గా అందరికీ సుపరిచితులు. హిందీ,తెలుగు సినిమాలను 1966, 2000 మధ్య 65 వరకు దర్శకత్వం వహించారు. అన్ని రకాల జోనర్ చిత్రాలను రూపొందించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. సినిమా కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. తాతినేని రామారావు మరణం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.