ఆహా ఓటీటీ వేదికగా.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో.. ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించి.. దేశంలోని టాక్ షోలకి.. అన్‌స్టాపబుల్ బాప్ షోగా నిలిచింది. ఫస్ట్ సీజన్ సాధించిన భారీ సక్సెస్.. రెండో సీజన్‌ని అంతకు మించి అనే రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకుస్తున్నారు. రెండో సీజన్‌లో.. సినీ రంగానికి చెందని వారిని మాత్రమే కాక.. రాజకీయాలకు చెందిన సెలబ్రిటీలు కూడా అన్‌స్టాపబుల్‌లో సందడి చేస్తున్నారు. ఇక 2022 ఇయర్ ఎండింగ్ సందర్భంగా డిసెంబర్ 30న అన్‌స్టాపబుల్‌లో ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో.. అన్‌స్టాపబుల్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సినిమా రంగాన్ని కుదిపేస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. నిర్మాత వందల కోట్లు ఖర్చు చేసి.. తీసిన సినిమాను.. కొందరు విడుదల రోజునే పైరసీ చేస్తున్నారు. అన్‌స్టాపబుల్ కూడా ఇదే సమస్య ఎదుర్కొంటుంది. ఈ షోకు సంబంధించి పలు ఎపిసోడ్, ప్రోమోలను కొందరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. కొన్ని ఎపిసోడ్‌లకు సంబంధించి.. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు గాను.. అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్.. ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అన్‌స్టాపబుల్ అనధికారిక ప్రసారాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
‘అన్‌స్టాపబుల్’ షోకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఉన్న అనధికారిక లింకులను వెంటనే తొలగించాలని.. ఢిల్లీ హైకోర్టు.. టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇక అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లో ప్రభాస్‌కు సంబంధించిన ఎపిసోడ్ మొదటి భాగం స్ట్రీమింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. రెండో భాగం జనవరి 6వ తేదీన స్ట్రీమ్ కానుంది. మరి కోర్టు ఆదేశాలతో.. ఇల్లీగల్ స్ట్రీమింగ్ ఆగిపోతుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.