ఆఫర్లు అంటే సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో పెద్ద పెద్ద కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆన్ లైన్ సేల్స్ పెరిగిపోయాయి.. ప్రతి ఒక్కరూ ఏ చిన్న ఆఫర్ ఉన్నా వెంటనే ఆన్ లైన్ బుక్ చేసుకుంటున్నారు. అలా ఆన్ లైన్ లో బుక్ చేసిన వారు దారుణంగా మోసపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో తాము ఆన్ లైన్ చేసిన వస్తువులు ఒకటైతే డెలివరీ అయ్యేవి మరొకటి కావడంతో లబో దిబో అంటుంటారు కస్టమర్లు. తాజాగా సినీ నటి జీవితను టార్గెట్ చేసుకొని.. ఓ మోసగాడు ఆమె మేనేజర్ ని బురిడీ కొట్టించాడు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటి జీవిత ని లక్ష్యంగా చేసుకొని.. ఆమె మేనేజర్ ని చెన్నైకి చెందిన ఓ మోసగాడు దారుణంగా మోసం చేశాడు. ఈ విషయం పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడంతో ఆ కేటుగాన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల నటి జీవితకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తన పేరు ఫారూక్ అని.. మీకు ఇంటర్ నెట్ కనెక్షన్ ఇచ్చింది తనే అని పరిచయం చేసుకున్నాడు. అప్పుడు నటి వేరే పనిలో బిజీగా ఉండటంతో ఆ విషయం తన మేనేజర్ తో చెప్పమని సూచించింది. తర్వాత జీవిత మేనేజర్ తో మాట్లాడిన ఫారూక్ ఇటీవల తనకు కంపెనీలో ప్రమోషన్ వచ్చిందని.. ప్రస్తుతం జియో లో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై బంపర్ ఆఫర్ ఉందని.. తాను రిఫర్ చేసి మీకు 50 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తానని నమ్మించాడు.
ఈ ఆఫర్ కొద్ది కాలమే ఉంటుందని.. దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షార్ట్స్ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. రూ.2.5 లక్షల ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కేవలం రూ.1.25 లక్షలకే వస్తుందని ఫారూక్ చెప్పిన మాటలు నమ్మిన జీవిత మేనేజర్ అతడి మాయలో పడిపోయాడు. రూ.1.25 లక్షల రూపాయలు అతని అకౌంట్ లోకి ఆన్ లైన్ చేశాడు. తర్వాత అతనికి ఫోన్ చేస్తే స్పందన రాలేదు.. ఆ తర్వాత ఫోన్ స్వచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్లుగా లబో దిబో అన్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతని ఫోన్, ఆన్ లైన్ అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేశారు. చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబు అని తెలుసుకొని అతడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా నాగేంద్ర సినీ ఇండస్ట్రీ వాళ్లను టార్గెట్ చేసుకొని పలు మోసాలకు పాల్పపడ్డారని పోలీసులు తెలిపారు.