బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఆమె తనను మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సెలెబ్రిటీలు ఏదైనా వస్తువు కానీ, సేవను కానీ ప్రమోట్ చేయటం సర్వసాధారణం. సినిమా వాళ్లనో.. క్రీడా రంగానికి చెందిన వారినో బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టి తమ వస్తువులను సేవలను ఆయా సంస్థలు ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా చేయటం వల్ల తమ వాటికి మంచి ప్రమోషన్ వస్తుందని, మార్కెట్‌లో సేల్స్ బాగా ఉంటాయని సదరు సంస్థలు భావిస్తూ ఉంటాయి. కోట్ల రూపాయలు వెచ్చించి సెలెబ్రీలను తమ వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటూ ఉంటారు. సెలెబ్రిటీల మీద నమ్మకంతో సాధారణ జనం వస్తువులను లేదా సేవలను వినియోగిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ నమ్మకమే సెలెబ్రిటీలకు ఇబ్బందిగా మారుతుంది.
సెలెబ్రిటీల మీద నమ్మకంతో వాటిని కొని వినియోగించిన తర్వాత అవి బాగోలేకపోతే వినియోగదారులు కేసులు పెట్టేస్తున్నారు. గతంలో చాలా మంది బ్రాండ్ అంబాసిడర్ల మీద వినియోగదారులు కేసులు పెట్టారు. తాజాగా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై కేసు పెట్టాడో ఓ వ్యక్తి. ఆమెను నమ్మి 86 లక్షలు మోసపోయానని ఆ వ్యక్తి పోలీసుల దగ్గర వాపోయాడు. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గౌరీ ఖాన్.. తుల్సియానీ కన్‌స్ట్రక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
ముంబైకి చెందిన జశ్వంత్ షా అనే వ్యక్తి లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ఏరియాలో ఉన్న తుల్సీయానీ గోల్ఫ్ వ్యూలో ఓ ఫ్లాట్ కొన్నాడు. దాని ఖరీదు అక్షరాలా 86 లక్షల రూపాయలు. అయితే, ఫ్లాట్ కోసం డబ్బులు కట్టించుకున్న సదరు సంస్థ ఫ్లాట్‌ను అతడికి ఇవ్వలేదు. నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు. తుల్సీయానీ సంస్థ డైరెక్టర్ మహేష్ తుల్సీయానీ, ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న గౌరీ ఖాన్‌ఫై కేసు పెట్టాడు. తాను గౌరీ ఖాన్‌ను నమ్మి ఆ సంస్థలో ఫ్లాట్ కొన్నానని చెప్పాడు. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 409 ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.