వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి వారం తర్వాత కూడా కౌంటర్ దగ్గర తెగుతున్న టికెట్లు, బాక్సాఫీసు వద్ద వస్తున్న వసూళ్లను చూస్తే అర్థమైపోతుంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో చూశామంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక ఫ్యాన్ తమ అభిమాని హీరోని డైరెక్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మరోసారి రుజువైంది. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలు, హీరోలు, డైరెక్టర్లు అంతా పూనకాలు లోడింగ్ అంటున్నారు.
డైరెక్టర్ కొరటాల శివ కూడా వాల్తేరు వీరయ్య సినిమా చూసి చాలా అద్భుతంగా ఉందంటూ చెప్పారట. ఆ విషయాన్ని డైరెక్టర్ బాబీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొరటాల గారితో రిలేషన్ ఎలా ఉంటుంది? సినిమా గురించి ఆయన ఏమన్నారు అని అడగ్గా.. “నేను దిల్ రాజుగారికి వర్క్ చేస్తున్న సమయం నుంచే నాకు కొరటాల గారితో పరిచయం ఉంది. ఆయన బృందావనం సినిమాకి వర్క్ చేస్తున్న సమయంలో నేను సేమ్ కాంపౌండ్లో ఉండేవాడిని. మిస్టర్ పర్ఫెక్ట్ స్టోరీకి వర్క్ చేస్తున్నప్పుడు తరచుగా కలుస్తూ ఉండేవాళ్లం. తమ్ముడు, బాబీ, బ్రదర్ అంటూ చాలా బాగా మాట్లాడేవారు”
“మిర్చితో ఆయన సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత.. పది సినిమాలకు చేయకపోయినా కూడా మంచి కథ ఉంటే చాలు స్టార్ హీరోలు మనల్ని కూడా పిలుస్తారని నమ్మకం ఆయన్ని చూసిన తర్వాతే వచ్చింది. జయలవకుశ సమయంలో తారక్ కి కథ చెప్పాలి అంటే కొరటాలను కలవాలని దానయ్య చెప్పారు. కొరటాల గారి ద్వారానే ఎన్టీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఆయనకి రవితేజ పాత్ర లేక ముందు ఉన్న కథ తెలుసు, తర్వాతి కథ కూడా తెలుసు. రవితేచ క్యారెక్టర్ యాడ్ చేసిన కథనే నమ్మమని చెప్పారు. సినిమా చూసిన తర్వాత కూడా కాల్ చేసి చాలా బాగుందని చెప్పారు” అంటూ డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చాడు.