దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళుల చరిత్ర నేపథ్యంలో.. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే.. భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమాను తమిళ ప్రేక్షకులంతా కోలీవుడ్ బాహుబలి అవుతుందని భావిస్తున్నారు. అదీగాక ఈ సినిమాలో హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ అంతా నటించేసరికి సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి చోళుల కథగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మూవీలో ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు ఏమున్నాయో చూద్దాం!
సుందర చోళుడు: చోళ సామ్రాజ్యానికి రాజు సుందరచోళుడు. పొన్నియన్ సెల్వన్ మూవీ స్టోరీ.. సుందర చోళుడి క్యారెక్టర్ తోనే మొదలవుతుంది. కథ మొదలయ్యే సమయానికి సుందర చోళుడు అనారోగ్యానికి గురై మంచాన పడతాడు. దీంతో చోళ రాజ్య సింహాసనంపై తదుపరి రాజు ఎవరనే చర్చలు మొదలవుతాయి. అయితే.. సుందర చోళుడి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించగా.. అతని భార్య వామనన్ దేవిగా విద్యా సుబ్రహ్మణ్యన్ నటించారు. వీరికి ముగ్గురు సంతానం.
ఆదిత్య కరికాలన్: చోళ సామ్రాజ్య రాజు సుందర చోళుడి పెద్ద కొడుకే ఈ ఆదిత్య కరికాలన్. సినిమాలో ఈ పాత్రను చియాన్ విక్రమ్ పోషించాడు. ఇదివరకే చాలా సినిమాలతో వర్సటైల్ యాక్టర్ అనిపించుకున్న విక్రమ్.. ఆదిత్య కరికాలుడి పాత్రలో ఒదిగిపోయాడు. తంజావూరుకు దూరంగా కాంచీపురంలో కోట కట్టుకొని ఉంటాడు. తాను రావాలని అనుకున్నప్పుడే తంజావూరుకు వచ్చి వెళ్తుంటాడు. తంజావూరు కోశాధికారి పెద్ద పలువేట్టరాయుడి భార్య నందినీని ప్రేమిస్తాడు.
అరుళ్మోలి వర్మన్: సుందర చోళుడి చిన్న కొడుకు. ఆదిత్య కరికాలుడికి సోదరుడు. నాటి లంకలో ఉన్న చోళులకు రక్షణగా నిలుస్తాడు. చోళ ప్రజలంతా అరుళ్ మోళినే కాబోయే రాజుగా భావిస్తారు. ఈ సినిమాలో అరుళ్మోలి వర్మన్ పాత్రలో జయం రవి నటించాడు. రాజ్యానికిరక్షకుడిగా , తండ్రి సుందర చోళుడి మాటకు కట్టుబడి ఉండే పాత్ర ఇది. వీర పరాక్రమ బలం ఇతని సొంతం. ఇతన్నే చోళులు పొన్నియన్ సెల్వన్ గా పిలుచుకుంటారు.
కుందవై: సుందర చోళుడి ఏకైక కుమార్తె కుందవై. ఎంతో అందగత్తె. గొప్ప రాజనీతి, రాజతంత్రాలు తెలిసిన కుందవై.. చోళుల రాజధాని పలయారైలో ఉంటుంది. తండ్రి సుందర చోళుడి ఆజ్ఞ మేరకు.. సోదరులు ఆదిత్య కరికాలన్, అరుళ్మోలి వర్మన్ లను తంజావూరుకు రప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ పాత్రలో త్రిష నటించింది. అటు సుందర చోళుడి కూతురిగా ఎల్లప్పుడూ రాజ్య ప్రజల క్షేమాన్ని కోరుతుంది.
నందినీ: ప్రతినాయిక లక్షణాలున్న పాత్ర ఇది. సుందర చోళుడి నమ్మిన వ్యక్తి, తంజావూరు కోశాధికారి పెద్ద పలువేట్టరాయుడి భార్య. ఎంతో అందంగా ఉండే నందిని ఓ అనాధ. యువరాజు ఆదిత్య కరికాలన్ ప్రేమించిన అమ్మాయి. అయితే.. ఆదిత్య కరికాలన్ వీర పాండ్యన్ ని చంపినప్పటి నుండి పగతో రగిలిపోతుంటుంది. ఈ పాత్రలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించింది.
పెద్ద పలువేట్టరాయ: సుందర చోళుడికి బాగా నమ్మకమైన వ్యక్తి, తంజావూరు కోశాధికారి. ఆదిత్య కరికాలన్ ప్రేమించిన నందినీకి భర్త. అయితే.. ఎప్పుడైతే సుందర చోళుడు అనారోగ్యంతో మంచాన పడతాడో.. అప్పటినుండి చోళ రాజ్య సింహాసనం దక్కించుకోవాలని సామంత రాజులతో చర్చలు జరుపుతుంటాడు. అయితే.. పెద్ద పలువేట్టరాయుడికి భార్య నందిని కూడా అధిష్ఠానం కోసం ఐడియాలు ఇస్తుంటుంది. ఈ పాత్రలో శరత్ కుమార్ నటించాడు.
వల్లవరాయన్ వంధ్యదేవుడు: వానర వంశ యోధుడు. యువరాజు ఆదిత్య కరికాలుడికి స్నేహితుడు, నమ్మిన వ్యక్తి. వంద్యదేవుడి ద్వారానే పొన్నియన్ సెల్వన్ అసలు కథ మొదలవడం, అతనే కథను ముందుకు నడిపించడం జరుగుతుంది. వంద్యదేవుడు మంచి మాటకారి.. ఆడవాళ్లను తన మాటలతోనే ముగ్గులోకి లాగేయగలడు. సుందర చోళుడి కూతురు కుందవైని ఇష్టపడతాడు. ఈ పాత్రలో హీరో కార్తీ నటించాడు.
సముద్ర కుమారి(పూంగులలి): పలయారై నుండి లంకకు పడవ నడిపే యువతి పాత్ర ఇది. సుందర చోళుడి చిన్న కొడుకు, యువరాజు అరుళ్మోలి వర్మన్ ని ఇష్టపడుతుంది. అయితే.. సముద్ర ప్రయాణంలో జరిగే శత్రువుల దాడిలో యువరాజు అరుళ్మోలి, వంద్యదేవుడిని కాపాడే క్రమంలో ప్రాణాలు పణంగా పెడుతుంది. ఈ పాత్రలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి నటించింది.
ఆళ్వార్ కడియన్ నంబి: చోళ రాజ్యానికి గూఢచారిగా, చోళ ప్రధాని కోసం పనిచేస్తుంటాడు. చోళ రాజ్యానికి సంబంధించిన విషయంలో వంద్యదేవుడిని పలుమార్లు కలుస్తాడు. వైష్ణవ బ్రాహ్మణుడిగా చెప్పుకొని తిరుగుతుంటాడు. చమత్కారం కలిగిన ఈ పాత్రలో నటుడు జయరాం నటించాడు. గుండుతో పిలక పెట్టుకొని, బ్రాహ్మణుడిగా నవ్వులు పూయించే అవకాశము ఉంది. ఈ పాత్రకు తెలుగులో తనికెళ్ళ భరణి డబ్బింగ్ చెప్పారు.
వానతి: యువరాణి కుందవైకి చెలికత్తెగా ఉంటూనే యువరాజు అరుళ్మోలి వర్మన్ ని ప్రేమిస్తుంది. తంజావూరు సామంత రాజు కుమార్తె వానతి. ఈ పాత్రలో తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ నటించింది.
మధురాంతకుడు: తంజావూరులో సుందర చోళుడి తర్వాత అధిష్టానంపై ఆశపడతాడు. సుందర చోళుడి కుమారులను కాదని.. పెద్ద పలువేట్టరాయుడితో చేతులు కలిపి ఆదిత్య కరికాలన్, అరుళ్మోలిలను చంపించే ప్రయత్నం చేస్తాడు. ఈ పాత్రలో రెహమాన్ నటించాడు.
ఈ విధంగా పొన్నియన్ సెల్వన్ లో చెప్పుకోదగిన పాత్రలు వీర పాండ్యన్(నాజర్), పార్థిబేంద్ర పల్లవన్(విక్రమ్ ప్రభు) ఇలా ఉన్నాయి.