ఈ ఏడాది సినీ, బుల్లితెర ఇండస్ట్రీకి అస్సలు కలిసిరాలేదనే అనిపిస్తుంది.. వరుసగా సినీ సెలబ్రటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ఫ్యాన్స్ దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. ఈ రోజు తెలుగు దర్శకుడు మదన్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం మరువకముందే.. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ కన్నుమూశారు. ఆమె వయసు 24 సంవత్సరాలు. గత కొంత కాలంగా పలుమార్లు గుండెపోటుతో బాధపడుతున్న ఐంద్రీలా కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.
బెంగాలీ ఇండస్ట్రీలో బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చిన ఐంద్రీలా శర్మ పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఐంద్రీలా శర్మ పశ్చిమ బెంగాల్ లోని బెర్హంపూర్ లో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే కోరికతో ఉన్న ఐంద్రీలా శర్మ బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టింది. మహాపీఠ్ తాతా పీఠ్, జిబన్ జ్యోతి మరికొన్ని సీరియల్స్ లో నటించిన ఐంద్రీలా శర్మ తర్వాత అమీ దీతీ నంబర్ 1, లవ్ కేఫ్ లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది.
గత కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఐంద్రీలా శర్మకు నవంబర్ 1న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోల్ కొతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలో ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఐంద్రీలా శర్మకి మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో నవంబర్ 14 న ఆమెకు పలుమార్లు హార్ట్ ఎటాక్ రావడంతో ఐంద్రీలా శర్మ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయిందని డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్ ఉన్న మంచి నటి ఇంత చిన్న వయసులో కన్నుమూయడంతో బెంగాలీ ఇండస్ట్రీ విశాదంలో మునిగిపోయింది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.