అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా అల్లు శిరీష్.. ఈ సినిమాలో రొమాన్స్ పాళ్ళు పెంచేశారు. అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా అల్లు శిరీష్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఘాటైన ముద్దు సన్నివేశాలతో యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మన అందరి అభిమాన హీరో బాలకృష్ణను ఆహ్వానించారు.
అందరి హీరోల అభిమానులు సినిమా చూస్తేనే ఆ సినిమా బాగా ఆడుతుంది. ఒక హీరో సినిమాని.. మిగతా హీరోల అభిమానులు కూడా చూడాలన్న సదుద్దేశంతో.. పలు హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి కొంతమంది హీరోలు ముఖ్య అతిథులుగా పిలుస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోతో అల్లు ఫ్యామిలీతో బాలకృష్ణకి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వీర సింహారెడ్డి వస్తే అల్లు శిరీష్ సినిమాకి బాగా హైప్ వస్తుంది. అందుకే బాలయ్య బాబు ఈవెంట్ కి హాజరయ్యారు. మరి బాలయ్య ఎక్కడుంటే అక్కడ గోల ఉండాల్సిందేగా. ఈవెంట్ లో బాలయ్య.. అల్లు శిరీష్ ను కాసేపు ఆటపట్టించారు.
ట్రైలర్, పోస్టర్ చూస్తుంటే రొమాన్స్ బాగా చేశావు.. సినిమా వరకేనా.. బయట కూడా ఇంతేనా? అంటూ శిరీష్ ని ప్రశ్నించారు. దీంతో అల్లు శిరీష్ ఇబ్బంది పడుతూ.. అయ్యో సార్ సినిమాలో యాక్టింగ్ అంతే, బయట నేను బుద్ధిమంతుడ్ని అంటూ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ప్రశ్నలకు.. అల్లు శిరీష్ ఇలా అయితే నాకు పిల్లనివ్వరు సార్ ఎవరూ అని అన్నారు. ‘అవునా మరి పెళ్ళెప్పుడు’ అంటూ శిరీష్ ని ప్రశ్నించారు బాలకృష్ణ. ఇలా వరుస ప్రశ్నలతో బాలకృష్ణ.. కాసేపు శిరీష్ ని సరదాగా ఆటపట్టించారు. ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ రచ్చ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.