తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా వెలుగొందిన బాబు మోహన్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల పలు టీవీ షోల్లో పాల్గొంటు ఎంట్రటైన్ మెంట్ చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు తమదైన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఏ ఇండస్ట్రీలో లేని కమెడియన్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. 90వ దశకంలో బ్రహ్మానందం, కోటా శ్రీనివాస రావు, ఆలీ, బాబు మోహన్, వేణు మాదవ్ వీళ్లు లేని సినిమా ఉండదు అనే స్థాయిలో కొనసాగింది. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి.. వీరిద్దరు తెరపై కనిపిస్తే చాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవారు. వెండితెరపై నవ్వించినా ఈ ఇద్దరి జీవితాల్లో చాలా విషాదం దాగి ఉంది. వీరిద్దరి కొడుకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికీ ఆ సంఘటనలు గుర్తు చేసుకొని కుమిలిపోతుంటారు. తాజాగా బాబూ మోహన్ ఓ షోలో కన్నీరు పెట్టుకోవడం అందరి హృదయాలు కలచి వేసింది. వివరాల్లోకి వెళితే..
బాబు మోహన్ ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ ప్రశ్నకు బదులేది మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు బాబు మోహన్. ఈ తర్వాత ఆహుతి, అంకుశం, మామగారు వరుస చిత్రాల్లో తనదైన కామెడీ పండించారు. స్టార్ కమెడియన్ గా కొనసాగుతూ.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలుగు దేశం పార్టీ తరుపు నుంచి 1998 ఉప ఎన్నికలలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. తర్వాత 2018లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల పలు టీవీ షోల్లో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం బుల్లితెరపై ఓ ప్రముఖ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు బాబు మోహన్. దీనికి సంబంధించిన ఎపిసోడ్ విడుదలైంది. ఇందులో చిన్న పిల్ల స్కిట్ చూసి బాబు మోహన్ చాలా ఎమోషన్ అయ్యారు. తన జీవితంలో జరిగి చేదు అనుభవాలు, సంఘటనలు గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. మా అమ్మ చిన్న తనంలోనే చనిపోయింది.. నన్నూ, నా చెల్లిని నాన్న వదిలేసి వెళ్లిపోయాడు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియదు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నో కష్టాలు పడుతూ చదువుకున్నాం.. చిన్నప్పుడు నా చెల్లికి నేనే జడలు వేసేవాడిని’ అంటూ చెప్పుకొచ్చి కంటతడి పెట్టారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బాబు మోహన్ జీవితంలో ఇంత విషాదం ఉందని ఎవరూ ఊహించలేరు.. ఎన్నో చిత్రాల్లో నటించిన మెప్పించిన ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.