ఒక హీరోగా అక్షయ్ కుమార్ కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే అక్షయ్ కుమార్ విషయంలో కెనడా పౌరసత్వానికి సంబంధించి మాత్రం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే మొదటిసారి కెనడా పౌరసత్వంపై అక్షయ్ కుమార్ నోరు విప్పాడు. అసలు తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెెల్లడించాడు.
అక్షయ్ కుమార్.. బాలీవుడ్ లో చాలా బిజీగా ఉండే యాక్టర్ అని అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తి కూడా అక్షయ్ కుమార్ కావడం విశేషం. ఏడాదికి 3 నుంచి 6 సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే అక్షయ్ కుమార్ విషయంలో ఎప్పటి నుంచో కెనడా పౌరసత్వంపై ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ‘టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు కెనడా పౌరసత్వం ఉన్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఆ సమయంలో అక్షయ్ కుమార్ పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
అక్షయ్ కుమార్ పై గత కొన్నేళ్లుగా కెనడా పౌరసత్వం విషయంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అతను ఎందుకు కెనడా పౌరసత్వం తీసుకున్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ, విషయం తెలియకుండానే అక్షయ్ కుమార్ ని ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ తనపై ట్రోల్స్ పై స్పందించాడు. అసలు తాను అలా ఎందుకు చేశాడు? కెనడా పౌరసత్వం ఎందుకు తీసుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. కెనడా పౌరసత్వాన్ని వదులుకోనున్నాను అని కూడా వెల్లడించాడు. తనకి అన్నీ ఇచ్చిన దేశంలోనే తాను ఉంటానంటూ క్లారిటీ ఇచ్చాడు.
“చాలా మంది నా కెనడా పౌరసత్వంపై కామెంట్ చేస్తుంటారు. నేను ఏ పరిస్థితిలో అలా చేశానో ఎవరికీ తెలియదు. ఆ విషయాన్ని దాచిపెట్టాలి అనుకుంటే అసలు నేను చెప్పేవాడినే కాదు. భారత్ నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు నేను అనుభవిస్తుందంతా ఈ దేశం ఇచ్చినదే. 1990ల్లో చాలా కష్టాలు పడ్డాను. వరుసగా 15 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కెనడాలో ఉండే నా ఫ్రెండ్ సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాను. కెనడా పాస్ పోర్టుకి అప్లై చేశాను. కెనడా పాస్ పోర్టు నాకు వచ్చింది. కానీ, ఆ తర్వాత నావి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇంక కెనడాకి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఇక్కడే వరుస అవకాశాలు దక్కాయి. ఇంక కెనడా పాస్ పోర్టు సంగతి మర్చిపోయా. భారత పౌరసత్వానికి అప్లై చేశాను. రాగానే కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటా” అంటూ అక్షయ్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు.